జర్నలిస్టుల ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం…

జర్నలిస్టుల ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం…
రాష్ట్ర ఆదేశాలతో వైద్య శిబిరాలు
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : సమాజానికి సమాచారాన్ని చేరవేసే జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో లెప్రసీ వార్డును పరిశీలించిన అనంతరం, జర్నలిస్టుల కోసం నిర్వహించనున్న మెడికల్ హెల్త్ చెకప్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దాని భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జర్నలిస్టులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే మీడియా ప్రతినిధులకు ఆరోగ్య పరీక్షలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టులు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 8 గంటల నుంచి చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించబడనుంది. అపోలో ఆసుపత్రి వైద్యుల సహకారంతో నిర్వహించే ఈ శిబిరంలో రక్తపోటు (బీపీ), రక్తంలో చక్కెర స్థాయి (షుగర్), ఈసీజీ, 2డీ ఎకో, సీరం క్రియాటినిన్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ) వంటి కీలక పరీక్షలు నిర్వహించనున్నారు.
అదనంగా గుండె సంబంధిత వ్యాధులు, ఎముకలు (ఆర్థోపెడిక్), దంత వైద్యం, గైనకాలజీ, మానసిక ఆరోగ్యం, లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్‌ఎఫ్‌టి), రీనల్ ఫంక్షన్ టెస్ట్ (ఆర్‌ఎఫ్‌టి) తదితరంగా మొత్తం 60 రకాల పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, నేత్ర, న్యూరో, గ్యాస్ట్రో వంటి విభాగాల నిపుణులు పాల్గొని వైద్య సేవలు అందించనున్నారు.
వైద్య పరీక్షలకు హాజరయ్యే జర్నలిస్టులు తమ పేరు, పనిచేస్తున్న పత్రిక, అక్రిడిటేషన్ నంబర్‌తో పాటు కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని సూచించారు. అక్రిడిటేషన్ కార్డు లేని వారు కూడా గతంలో పొందిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఓ పద్మాంజలి దేవి, డాక్టర్ ఉషా చరణ్, అపోలో వైద్యులు, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. వేలాయుధం తదితరులు పాల్గొంటారు. మీడియా మిత్రులందరూ ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
