Jatara | చిలుకల చిన్నమ్మ..! సల్లంగా చూడమ్మా..!!

Jatara | చిలుకల చిన్నమ్మ..! సల్లంగా చూడమ్మా..!!
- ఘనంగా చిలుకల చిన్నమ్మ జాతర
- మౌని అమావాస్య రోజు ఆనవాయితీగా జాతర
- మొక్కులు చెల్లించుకున్న భక్తులు
Jatara | బాల్కొండ, ఆంధ్రప్రభ : మాఘమాస అమావాస్యను పురస్కరించుకొని బాల్కొండ మండలంలోని ప్రసిద్ధ శ్రీరాంపూర్ చిలుకల చిన్నమ్మ జాతర ఉత్సవాలను ఇవాళ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయాభివృద్ధి, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాఘ (మౌని) అమావాస్య రోజున జాతర నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఉదయం పవిత్ర గోదావరి నది నుండి గంగాజలాలను డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. జాతర సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు, నైవేద్యాలను సమర్పించి కోళ్లను, గొర్రెలను, మేకలను బలిచ్చి తమ తమ మొక్కులను చెల్లించుకున్నారు.
“చిలుకల చిన్నమ్మ..! చల్లంగా చూడమ్మా..!!

చిలుకల చిన్నమ్మ.. చల్లంగా చూడమ్మా.. అంటూ పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారిని వేడుకున్నారు. జాతర సందర్భంగా పలు దుకాణాలు భారీగా వెలిశాయి. ఉమ్మడి బాల్కొండ మండలంలోని ప్రజలు, మహిళలు చుట్టుపక్కల గ్రామాల వారు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులను చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయాభివృద్ధి, గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాల్కొండ ఎస్సై శైలెందర్ తన సిబ్బందితో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
