- విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించండి
- విజయవాడ విమానాశ్రయ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష
- నిర్దేశిత గడువులోగా టెర్మినల్ భవనం పూర్తి చేయాలని ఆదేశం
అమరావతి : రాష్ట్రంలో విమానయాన రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (భుదవారం) సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు అవకాశాలపై పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. విమానాశ్రయాల విస్తరణతో పాటు దేశీయ, అంతర్జాతీయ కనెక్టివిటీ మెరుగుపర్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ సమీక్షకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, కేంద్ర శాఖ ఉన్నతాధికారులు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వర్చువల్‌గా హాజరయ్యారు. ముఖ్యమంత్రి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనుల పురోగతిని సమీక్షిస్తూ, టెర్మినల్ భవనం డిజైన్ ప్రత్యేకతను ఉట్టిపడేలా చేయాలని అధికారులకు సూచించారు.
వైవిధ్యభరితమైన డిజైన్ – తెలుగు సంస్కృతి ప్రతిబింబించాలి !
ముఖ్య మంత్రి చంద్రబాబు టెర్మినల్ భవనం డిజైన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళల ప్రతిబింబం ఉండేలా చూడాలని అన్నారు. కూచిపూడి నాట్యం, కొండపల్లి బొమ్మలు, అమరావతి శిల్పాలు, లేపాక్షి కళాకృతులు వంటివి టెర్మినల్ డిపార్చర్, అరైవల్ బ్లాక్స్, ప్రయాణికుల లాంజ్‌లలో ప్రతిఫలించేలా డిజైన్ చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు.
ఇతర విమానాశ్రయాల పురోగతిపై కూడా చర్చ
కడప, రాజమహేంద్రవరం టెర్మినల్ భవనాల పనుల పురోగతిని కూడా మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు. దగదర్తి, కుప్పం, పలాస (శ్రీకాకుళం) వంటి కొత్త విమానాశ్రయాల టెక్నికల్ ఫీజిబిలిటీ రిపోర్టులపై పని జరుగుతోందని చెప్పారు.
అమరావతి విమానాశ్రయం కోసం భూ పరిశీలన కొనసాగుతోందని, రైట్స్ బృందం త్వరలో నివేదిక అందించనున్నట్టు తెలిపారు. ల్యాండ్ పూలింగ్ పూర్తయితే రెండు సంవత్సరాల్లో ప్రాజెక్టు ప్రారంభించవచ్చని మంత్రి పేర్కొన్నారు.
విస్తరిస్తున్న ఫ్లైట్ సేవలు
విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి ఫ్లైట్ కార్యకలాపాలు 40 శాతం వరకు పెరిగాయని మంత్రి తెలిపారు. విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు విమానాశ్రయాల నుంచి దేశీయ నగరాలకు మరిన్ని కనెక్టివిటీ అందించేందుకు ఆపరేటర్లు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.
ట్రూజెట్ సంస్థ అక్టోబర్ నుండి విశాఖపట్నం నుంచి కొత్త సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే విజయవాడ – సింగపూర్, తిరుపతి – మస్కట్ మధ్య విమాన సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ తర్వాత సీ ప్లేన్ ఆపరేషన్స్ కూడా ప్రారంభించే యోచనలో ఉన్నామని వెల్లడించారు.
భోగాపురం ప్రాజెక్టులో ఖతార్ పెట్టుబడులు
ఖతార్ ఏవియేషన్ ఫండ్ భోగాపురం విమానాశ్రయం వద్ద పెట్టుబడులకు ఆసక్తి చూపుతోందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు పెట్టుబడులు రాకతో ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటవుతుందని భావిస్తున్నారు.
ఈ సమీక్ష ద్వారా విమానయాన రంగంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తున్నది. ప్రజల రవాణా సౌకర్యాలకు తోడుగా, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఇది కీలకం కానుంది.