ప్రతిపక్షానికి కూడా పనికి రావని ప్రజలు హోదా ఇవ్వలేదు…
నంద్యాల బ్యూరో, ఏప్రిల్ 9 ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పినా ఇంకా ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నాడని, పోలీస్ అధికారులను బట్టలు ఊడదీస్తానని మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ ను కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. మంత్రి భార్య మరణించడంతో ఫరూక్ ను పరామర్శించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి 43సంవత్సరాలుగా పార్టీలో ఉన్న ఫరూక్ నీతి నిజాయితీకి నిలువుటద్దమని కితాబిచ్చారు.
ఆయన మాట్లాడుతూ… కేంద్రంలో ఇటీవల ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లు విషయంలో జగన్ ఆడిన డబుల్ గేమ్ విధానాన్ని అందరూ గమనించారని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయం అంతా మోసం, దాగాతోనే ఐదు సంవత్సరాలు గడిచిపోయిందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు వరకు అందరూ రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత టీడీపీ పార్టీదని పేర్కొన్నారు. నేడు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, జలాశయాలు గత ఏడాదిలో కురిసిన వర్షాల మూలంగా నిండుకుండలా ఉన్నాయని పేర్కొన్నారు.
మాజీ సీఎం జగన్ ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేశాడని విమర్శించారు. ఐదు సంవత్సరాల కాలంలో ఏనాడైనా ఏ ప్రాజెక్టునైనా పరిశీలించాడా అని ప్రశ్నించారు. గత ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క ఇరిగేషన్ శాఖలో 18వేల కోట్ల రూపాయల బిల్లులు బకాయిలు పెట్టాడని విమర్శించారు. అధికారం ఉన్నప్పుడు అడుగడుగునా 144 సెక్షన్, పరదాలు వంటి ఆంక్షలు పెట్టాడని పేర్కొన్నారు. ప్రతిపక్షానికి కూడా పనికి రావని ప్రజలే హోదా ఇవ్వకపోతే, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుగుతున్నాడని విమర్శించారు. ప్రజలు బుద్ది చెప్పినా జగన్ కు ఇంకా బుద్ది రాలేదన్నారు. జగన్ తరహాలోనే వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారని, ప్రజలే వారికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, చంద్రబాబు నాయుడు లాంటి తమ నాయకులపై కేసులు పెట్టి ఎలా వేదించావో ప్రజలు మర్చిపోలేదన్నారు.
నంద్యాల జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది..
రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు నంద్యాల జిల్లాను కూడా అభివృద్ధి దిశలో ఉంచేందుకు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మంత్రిని కలిశారు. పంట పొలాలకు తాగునీటి సమస్యపై చర్చించారు. నంద్యాల కేసీ కెనాల్ పరీవాహక రైతులు క్రింది పొలాలకు వేసిన పంటలకు సాగునీటికి ఇబ్బంది లేకుండా ముచ్చుమర్రి, హంద్రీ నీవా నుండి నీరు అందిస్తున్నామని రైతులకు మంత్రి హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో రైతులు ఆనందంతో ఉండేందుకు అన్ని ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ఫిరోజ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.