హైదరాబాద్ – సన్‌రైజర్స్ హైదరాబాద్! నిరుటి ప్రదర్శనతో ఐపీఎల్‌లో కొత్త రికార్డులు, ప్రత్యర్థి జట్లలో వణుకు పుట్టించిన సన్‌రైజర్స్.. కొత్త సీజన్లో దండయాత్రకు సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 3.30 కి సొంతగడ్డపై రాజస్థాన్‌ను హైదరాబాద్ ఢీకొనబోతోంది.
ఐపీఎల్-18లో తన తొలి పోరుకు సన్‌రైజర్స్ సన్నద్ధమైంది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో దుర్బేధ్యంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్ శుభారంభం చేయాలని ఉవ్విళ్లూరుతోంది.
కొత్త సారథి రియాన్ పరాగ్ సారథ్యంలో సీజన్‌ను ప్రారంభిస్తున్న రాజస్థాన్ మొదటి మ్యాచ్‌లోనే కఠినమైన పరీక్షకు సిద్ధమైంది. పటిష్టమైన సన్‌రైజర్స్ రూపంలో అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కోనుంది.
300.. సాధ్యమేనా!:
ఐపీఎల్‌లోనే అత్యంత విధ్వంసకర ఓపెనర్లు.. దూకుడు బ్యాటర్లు కలిగిన జట్టు సన్‌రైజర్స్. గత ఏడాది సన్‌రైజర్స్ సాగించిన ఊచకోత ప్రత్యర్థి జట్లలో దడ పుట్టేలా చేసింది. నిరుడు ఒక్క సీజన్‌లోనే మూడు సార్లు 250 పైచిలుకు స్కోర్లు నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు (287/3)తో హోరెత్తించింది. పవర్ ప్లేలో అత్యధిక పరుగుల (125/0) రికార్డునూ సొంతం చేసుకుంది. ఓపెనర్లు అభిషేక్‌శర్మ, ట్రావిస్ హెడ్‌తో పాటు వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్, ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డిల వీరవిహారం ప్రపంచ టీ20 క్రికెట్‌నే ఊపేసింది.
పొట్టి ఫార్మాట్లో 300 పరుగుల స్కోరు అసాధ్యం కాదన్న చర్చకూ తెరలేపింది. ఒకవేళ మొదట బ్యాటింగ్ చేస్తే 300 స్కోరు సాధించగల జట్టు సన్‌రైజర్సే అన్న ఘనత కూడా హైదరాబాద్‌కే దక్కింది. అభిషేక్, హెడ్, క్లాసెన్, నితీశ్‌ల దూకుడుకు ఇప్పుడు ఇషాన్ కిషన్ జతకలవడంతో 300 స్కోరు కష్టంకాదన్నది విశ్లేషకుల అంచనా.
నిరుడు పటిష్టమైన బెంగళూరుపై 287, ముంబయిపై 277, దిల్లీపై 266 (పవర్ ప్లేలో 125/0) స్కోర్లతో సత్తాచాటిన సన్‌రైజర్స్.. బలహీనమైన బౌలింగ్ దొరికితే ఆకాశమే హద్దుగా చెలరేగడం ఖాయమే!
కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మహ్మద్ షమి రూపంలో అనుభవంతో కూడిన నాణ్యమైన పేసర్లు ఉండటం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశం. పేసర్లు జైదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్‌ల వైవిధ్యం.. ఆడమ్ జంపా, రాహుల్ చాహర్‌ల స్పిన్ మాయాజాలం సన్‌రైజర్స్‌కు తిరుగులేని బలాలే.
సంజు శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా సంజు!:
ఇక ఐపీఎల్ ప్రారంభానికి ముందే పూర్తిస్థాయి కెప్టెన్ సంజు శాంసన్‌కు గాయమవడం రాజస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బే. సంజు వికెట్ కీపింగ్‌కు దూరంగా ఉంటాడని జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అతను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలో దిగొచ్చు. సంజు స్థానంలో తాత్కాలికంగా పగ్గాలు చేపట్టిన రియాన్ పరాగ్ జట్టులో ఏమేరకు స్ఫూర్తి రగిలిస్తాడన్నది చూడాలి. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్‌ను వేలం పాటకు ముందు వదిలేసుకోవడంతో రాజస్థాన్ బ్యాటింగ్ కాస్త గతితప్పినట్లుగా కనిపిస్తుంది.
ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను మినహాయిస్తే పరాగ్, షిమ్రన్ హెట్‌మైర్, ధ్రువ్ జురెల్, నితీశ్ రాణాలు రాజస్థాన్ బ్యాటింగ్ భారాన్ని ఎంత మేరకు మోస్తారన్నది ఇప్పుడే చెప్పలేం. జోఫ్రా ఆర్చర్ ఆధ్వర్యంలోని సందీప్‌శర్మ, తుషార్ దేశ్‌పాండే, ఫజల్‌హక్ ఫారూఖీ, మహీశ్ తీక్షణ, వనిందు హసరంగతో కూడిన బౌలింగ్ విభాగం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.
సన్‌రైజర్స్ దే పై చేయి
ఉప్పల్ స్టేడియంలో గత ఆరు మ్యాచ్‌ల్లో అయిదు సన్‌రైజర్స్ గెలిచింది.రాజస్థాన్‌తో తలపడిన గత మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ నెగ్గింది
తుది జట్లు (అంచనా)…సన్‌రైజర్స్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీశ్‌కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, మహ్మద్ షమి, ఆడమ్ జంపా, జైదేవ్ ఉనద్కత్
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైశ్వాల్, సంజు శాంసన్, నితీశ్ రాణా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రన్ హెట్‌మైర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్‌శర్మ, మహీశ్ తీక్షణ
.