Interstate Thief | అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్..!

Interstate Thief | అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్..!
Interstate Thief | హైదరాబాద్, ఆంధ్రప్రభ : కరడుకట్టిన అంతర్రాష్ట్ర దొంగ (Interstate thief) ను ఎట్టకేలకు సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. అతను స్టేషన్ నుంచి తప్పించుకొని పోవడంతో ఓ ఎస్ఐకి ఛార్జ్ మెమో వచ్చింది. పోలీస్ వర్గాల నుంచి తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. తెలుగు నాగిరెడ్డి అలియాస్ మల్లెపూల నాగిరెడ్డిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా (Nandyal District) కొత్తపల్లి మండలం వీరాపూర్ గ్రామం. పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. కల్వకుర్తి పరిధి పీఎస్‌లోనూ కేసులున్నాయి.
అనంతపురం జిల్లా జైలులో ఉన్న నాగిరెడ్డి (Nagireddy) ని గత ఏడాది నవంబర్ 11న కల్వకుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కల్వకుర్తికి తీసుకొచ్చి విచారించారు. అదే నెల 13న రాత్రి హెడ్ కానిస్టేబుల్ నిరంజన్, కానిస్టేబుల్ లాల్‌సింగ్ నాయక్, హోంగార్డు లక్ష్మణ్ కాపలా ఉండగానే వారి కళ్లుగప్పి మరుగుదొడ్డి కిటికీలోంచి చాకచక్యంగా పరారయ్యాడు.
అతడి కోసం పోలీసులు (police) ముమ్మరంగా గాలింపు చేపట్టినా ఫలితం లేపోయింది. దీంతో ఉన్నతాధికారులు అదే నెలాఖరులో కల్వకుర్తి ఎస్సై మాధవరెడ్డికి ఛార్జ్ మెమో ఇచ్చారు. హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. హోంగార్డును ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. హైదరాబాద్‌లోని మేడ్చల్ సీసీఎస్ పోలీసులు గత రాత్రి నాగిరెడ్డిని అరెస్ట్ చేసి, ఇవాళ తెల్లవారుజామున కల్వకుర్తి పీఎస్‌కు తీసుకొచ్చినట్లు సమాచారం.
