AP | 6నెలల్లో ఇంటిగ్రేటెడ్ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్… టీజీ భరత్

కర్నూలు, మార్చి 14 (ఆంధ్రప్రభ బ్యూరో ) : ఆరు నెలల్లో ఇంటిగ్రేటెడ్ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి తేస్తామని రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం పత్తికొండ మండలం, దూదేకొండ రెవెన్యూ గ్రామం, కోతిరాళ్ళ గ్రామ పంచాయతీ వద్ద రూ.11కోట్లతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు మంత్రి భూమిపూజ నిర్వహించి శిలాఫలకం ఆవిష్కరించారు.

ఈసందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కర్నూలు ఎంపీ, పత్తికొండ ఎంఎల్ఏ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి కోరగా, వెంటనే అందుకు సంబంధించిన పనులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందన్నారు. ఆ మేరకు ఈ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు కోసం నిధులు పుష్కలంగా ఉన్నాయని, ఈ ప్రాజెక్టు ఏర్పాటు 6 నెలల్లో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ, కాంట్రాక్టర్ లను ఆదేశించారు. యూనిట్ స్థాపన త్వరగా అయితే ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి విచ్చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.

ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.11కోట్లు ఖర్చు అవుతుందన్నారు. వీటి ద్వారా 32మందికి ప్రత్యక్ష ఉపాధి, 100మందికి పరోక్ష ఉపాధి కల్పన ఉంటుందన్నారు. టొమాటో కెచప్, టొమాటో పేస్ట్, టొమాటో పికిల్ లాంటి ఉత్పత్తులు తయారు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఏ రకమైన బాటిల్ లో అయినా కెచప్ ఒకటే రకంగా ఉంటుందని ఇక్కడ టొమాటో పంట పండించే రైతులతో మాట్లాడి ప్రత్యేకమైన జిన్ తో టొమాటో పంట పండిస్తే అదే రకమైన కెచప్ లాగా ఉండడంతో పాటు నాణ్యత కూడా ఉండడంతో సేల్ చేసుకునే దానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబులు పాల్గొని ప్ర‌సంగించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ డా.గెడ్డం శేఖర్ బాబు, వాల్మీకి సంఘం చైర్మన్ బొజ్జమ్మ, పత్తికొండ ఆర్డీఓ భరత్, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, తుగ్గలి నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *