IND vs ENG | తొలి వ‌న్డే టీమిండియాదే !

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ జట్టు నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని 12 ఓవర్లు మిగిలుండగానే 4 వికెట్ల తేడాతో అల‌వోక‌గా ఛేదించిన టీమిండియా తొలి విజయాన్ని అందుకుంది. ఇక ఈ విజ‌యంతో మూడు మ్యాచ్ ల వ‌న్డే సిరీస్ లో రోహ‌త్ సేన 1-0తో ముందంజ వేసింది.

కాగా, ఈ మ్యాచ్ లో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు విజృంభించింది. ఓపెనర్ యశశ్వి జైస్వాల్ (15), కెప్టెన్ రోహిత్ శర్మ (2) విఫలమైనప్ప‌టికీ… ఆ తర్వాత వచ్చిన శుభమాన్ గిల్(87), శ్రేయాస్ అయ్యర్(59), అక్షర్ పటేల్ (52) త‌లో హాప్ సెంచ‌రీతో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.

శుభ్‌మన్ గిల్ సెంచరీ చేస్తాడని ఆశించగా.. 32.6 ఓవర్లో సాకిబ్ మహమూద్ బౌలింగ్ లో అనూహ్య రీతిలో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక ఆ త‌రువాత వ‌చ్చిన కేల్ రాహుల్ రెండు ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరాడు. హార్దిక్ పాండ్యా (9 నాటౌట్) చేయ‌గా.. రవీంద్ర జ‌డేజా (12) విన్నింగ్ షాట్ ఆడి నాటౌట్ గా నిలిచాడు.

ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్ రెండేసి వికెట్లు తీయ‌గా… జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్ త‌లొ వికెట్ ప‌డ‌గొట్టారు.

ఇక‌, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేప‌ట్టిన ఇంగ్లండ్.. 47.4 ఓవ‌ర్ల‌లో 248 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఓపెన‌ర్ పిలిప్ సాల్ట్ (43), బెన్ డ‌కెట్ (32) రాణించ‌గా.. మిడిలార్డ‌ర్ లో కెప్టెన్ జాస్ బ‌ట్ల‌ర్ (52), జాకబ్ బెథెల్ (51) హాఫ్ సెంచ‌రీల‌తో ఆక‌ట్టుకున్నారు. టీమిండియా బౌల‌ర్ల‌లో హర్షిత్ రాణా (3/53), రవీంద్ర జ‌డేజా (3/26) తో చెల‌రేగారు. ఇక అక్ష‌ర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్ చెరో వికెట్ ద‌క్కించుకున్నారు.

ఇక, మూడు మ్యాచ్ ల‌ వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఈ నెల 9న ఒడిశాలోని కటక్ వేదిక‌గా జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *