TG | ప్రజాస్వామ్యానికి సిద్ధాంతపరమైన రాజకీయాలే రక్షణ మార్గం – సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో ధన ప్రభావం పెరిగిపోతుండడం ప్రజాస్వామిక విలువలకు ప్రమాదకర పరిణామమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) ఆందోళన వ్యక్తం చేశారు. సిద్ధాంతాలను నమ్మిన, విలువలతో కూడిన రాజకీయాలు కొనసాగాలి కానీ ఇప్పుడు వేగంగా ‘డెలివరీ’ చేసే నేతలను వెతికే ‘స్విగ్గీ పాలిటిక్స్’ ట్రెండ్ పెరిగిందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రమాదకరమని స్పష్టం చేశారు.

జైపాల్ రెడ్డి పేరు మీద అవార్డు ప్రదానం

హైదరాబాద్‌లో క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ, ICFAI సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు(Best Parliamentarian Award)ను స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి (Soodini Jaipal Reddy) పేరుతో నెలకొల్పారు. ఈ అవార్డును ప్రముఖ రచయిత మోహన్ గురుస్వామి(Mohan Guruswamy)కి సీఎం రేవంత్ రెడ్డి అందించారు.

జైపాల్ రెడ్డి పాత్ర అపూర్వం…

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, “జైపాల్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా మొదలుకుని కేంద్ర మంత్రిగా పలు పదవుల్లో అత్యుత్తమ సేవలందించారు. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన నేతగా ఆయన్ను దేశ రాజకీయాలు గుర్తించాయి. ఆయన విధాన నిర్ణయాలు, మీడియా స్వేచ్ఛకు అంకితంగా తీసుకొచ్చిన ప్రసార భారత చట్టం ప్రజాస్వామ్యానికి శక్తిని జోడించాయి,” అని కొనియాడారు.

తెలంగాణ సాధనలో కీలక పాత్ర

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జైపాల్ రెడ్డి పాత్రను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా గుర్తు చేశారు. “వారి చొరవ లేకపోతే తెలంగాణ సాధన ఈ విధంగా జరిగేది కాదు. రాజ్యసభలో సవరణలు ప్రతిపాదించడంలోనూ, కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ బిల్లును ఆమోదించించడంలోనూ ఆయన పాత్ర మరువలేనిది,” అని అన్నారు.

సిద్ధాంతపరమైన రాజకీయాల లోపం

ప్రస్తుతం రాజకీయాల్లో సిద్ధాంతపరమైన నేతలు తగ్గిపోతున్నారని సీఎం అభిప్రాయపడ్డారు. “ఇప్పుడు కార్యకర్తలు తగ్గిపోతూ వాలంటీర్లు పెరుగుతున్నారు. రాజకీయాలన్నవి మేనేజ్‌మెంట్‌గా మారుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే దిశగా తీసుకెళ్తోంది,” అని వ్యాఖ్యానించారు.

విద్యార్థి రాజకీయాల్లో సిద్ధాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలి

సిద్ధాంతాలపై నమ్మకంతో విద్యార్థి నాయకత్వం ఏర్పడాలి అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. “ధన ప్రభావం తగ్గి, విలువలతో కూడిన భిన్నాభిప్రాయాలు ఉన్న రాజకీయ పద్ధతులు స్థిరపడాలి. అప్పుడే ప్రజాస్వామిక స్పూర్తిని నిలబెట్టుకోగలుగుతాం,” అని తెలిపారు.

జైపాల్, పీవీ స్పూర్తితో పరిపాలన

జైపాల్ రెడ్డి, పీవీ నరసింహారావు వంటి మహానేతల స్పూర్తితో అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకంగా కొనసాగిస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ప్రొ. పురుశోత్తం రెడ్డి, ICFAI చైర్ పర్సన్ డా. యశస్వీ శోభారాణి, వైస్ చాన్సలర్ ప్రొ. ఎల్ఎస్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply