Uttar Pradesh | భార్య‌కు ప్రియుడితో వివాహం చేసిన భ‌ర్త‌

  • ఎనిమిదేళ్ల కాపురం చేసిన భార్య‌కు మ‌రో పెళ్లి
  • భార్య వేరే వారితో ప్రేమ‌లో ఉంద‌ని గుర్తింపు
  • భార్య ప్రియుడితో మాట్లాడిన భ‌ర్త‌
  • ద‌గ్గ‌రుండి వారిద్ద‌రికీ స్వ‌యంగా వివాహం


ప్ర‌యోగ‌రాజ్ : భార్య మరొకరిని ప్రేమించిందని తెలిసి.. దగ్గరుండి మరి వారికి పెళ్లి చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు కొందరు భర్తలు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. వివ‌రాల‌లోకి వెళితే, సంత్ కబీర్ నగర్‌కు చెందిన బబ్లూ అదే ప్రాంతానికి చెందిన రాధికకు 2017లో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. భార్యాబిడ్డల పోషణ నిమిత్తం.. బబ్లూ వేర్వేరు ప్రాంతాలకు పని కోసం వెళ్లేవాడు. ఈ క్రమంలో రాధికకు తన గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర బంధానికి దారితీసింది.

దీని గురించి రాధిక అత్తమామలకు తెలియడంతో వారు తమ కొడుకు బబ్లూకు ఈ విషయం చెప్పారు. భార్య గురించి నిజం తెలుసుకున్న బబ్లూ.. ఆమెని వదిలి వేయాలనుకోలేదు. ఆమెను మార్చుకోవాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అవేవీ రాధికలో మార్పు తీసుకురాలేదు. ఇక చేసేదేం లేక భార్య వివాహేతర బంధం గురించి గ్రామ పెద్దలకు చెప్పాడు బబ్లూ వారు మందలించినా రాధికలో మార్పు రాలేదు.

ఈ క్రమంలో బబ్లూ ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. భార్య రాధకను.. ఆమె ప్రేమించిన వాడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. రాధిక, ఆమె లవర్‌ను పిలిచి తన నిర్ణయం చెప్పాడు. అంతేకాక పిల్లల గురించి బాధపడవద్దని.. వారిని తాను చూసుకుంటానని తెలిపాడు. తమ ప్రేమకు భర్త అడ్డు చెప్తాడని భావిస్తే.. అందుకు భిన్నంగా అతడే దగ్గరుండి పెళ్లి చేస్తాననడంతో రాధిక సంతోషానికి హద్దే లేకుండా పోయింది.

ఇక భర్త సమక్షంలో.. గ్రామంలోని ఓ ఆలయంలో ప్రేమించిన వాడిని వివాహం చేసుకుంది రాధిక. బబ్లూ దగ్గరుండి తన భార్య చేయిని.. ఆమె ప్రేమించిన వాడి చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని సంతోషంగా ఉండమని ఆశీర్వదించాడు. ఈ సంఘటన ఆ గ్రామంలో సంచలనంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *