సేవారత్న జాతీయ అవార్డు అందుకున్న మార్త బిక్షపతి

సేవారత్న జాతీయ అవార్డు అందుకున్న మార్త బిక్షపతి

  • సామాజిక సేవలకు గుర్తింపు
  • తిరుపతిలో సౌత్ ఇండియా కాన్ఫరెన్స్‌లో సత్కారం

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు మార్త బిక్షపతి సేవారత్న జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన 18వ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ సందర్భంగా బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ సేవా రత్న జాతీయ అవార్డును తెలంగాణ ప్రభుత్వ అడ్వైజరీ బోర్డు సభ్యులు దరువు ఎల్లన్న అవార్డు సెలెక్షన్ కమిటీ సభ్యులు బొమ్మకంటి రాజేందర్ ల ఆధ్వర్యంలో అందజేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలో ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు అకాడమీ ప్రతి సంవత్సరం ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామంలో జన్మించిన మార్త బిక్షపతి 1978 నుంచి ఆర్ఎస్ఎస్, జనసంఘ్ కార్యకలాపాల్లో పాల్గొంటూ సామాజిక సేవలో చురుకుగా కొనసాగుతున్నారు. 1980 నుంచి భారతీయ జనతా పార్టీ క్రియాశీలక కార్యకర్తగా సేవలందిస్తున్నారు.

1995లో పరకాల మేజర్ గ్రామపంచాయతీ రెండో వార్డు సభ్యుడిగా ఎన్నికై ప్రజా సేవలో తన పాత్రను చాటుకున్నారు. పరకాల పట్టణ పద్మశాలి సంఘం మార్కండేయ హార్దిక సహకార సమితి కార్యదర్శిగా, పద్మశాలి సేవా సంఘం పట్టణ అధ్యక్షునిగా పలు సంవత్సరాలు సేవలందించారు. ప్రస్తుతం పట్టణ పద్మశాలి సేవా సంఘం గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

ట్రస్ట్ బోర్డు భవన నిర్మాణంలో కూడా కీలక పాత్ర పోషించారు. అలాగే శ్రీనివాస చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షుడిగా చేనేత కార్మికులకు సేవలు అందిస్తున్నారు. 2020 నుంచి 2025 వరకు భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. కరోనా సమయంలో ప్రతిరోజూ సుమారు వందమందికి ఆహారం అందిస్తూ సేవలందించారు.

కుటుంబ వివాదాల పరిష్కారం, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందుండి పనిచేస్తున్నారు. తన సేవలను గుర్తించి సేవారత్న జాతీయ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల మార్త బిక్షపతి బహుజన సాహిత్య అకాడమీ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పరకాల పద్మశాలి సంఘం నాయకులు, బీజేపీ నాయకులు మరియు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Leave a Reply