రూ. 320 కోట్లతో అంచనాకు రైల్వే శాఖ ఆమోదం
వరంగల్ సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ వద్ద రైల్ ఓవర్ రైల్ ప్రాజెక్టు (Dornakal Rail Over Rail Project) కు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ డోర్నకల్ జంక్షన్ వద్ద రైల్ ఓవర్ రైల్ (10.5 కి.మీ మేర ) ప్రాజెక్టుకు ప్రతిపాదనను నిన్నటి రోజున ఆమోదించింది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.320 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఈ ప్రాజెక్టుతో రైల్వే విభాగంలో రైలు కార్య కలాపాలను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంది.
విజయవాడ – కాజీపేట మెయిన్ లైన్ (Vijayawada Kazipet Main Line) లో డోర్నకల్ జంక్షన్ ఉంది. ఇది రద్దీగా ఉండే మార్గం. విజయవాడ -కాజీపేట సెక్షన్‌ను నాలుగు లైన్ల కు పెంచే ప్రతిపాదన పురోగతిలో ఉంది. ఈ జంక్షన్ లోని రైళ్లు విజయవాడ, కాజీపేట దిశకు అదనంగా భద్రాచలం వైపు నడుస్తాయి. విజయవాడ, భద్రాచలం మధ్య రైలు రాకపోకలను సులభతరం చేయడానికి డోర్నకల్ జంక్షన్ వద్ద బై పాస్ లైన్ నిర్మించబడింది.
అయితే, విజయవాడ నుండి భద్రాచలం (Vijayawada to Bhadrachalam) వైపు రైళ్ల రాకపోకలు స్టేషన్ మీదుగా క్రాసింగ్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఫలితంగా రైళ్లు నిలుపుదల చేయ బడతాయి. ఇప్పుడు డోర్నకల్ వద్ద ప్రతిపాదించబడిన 10.5 కిలోమీటర్ల దూరం గల రైల్ ఓవర్ రైలు, విజయవాడ నుండి డోర్నకల్ మీదుగా భద్రాచలం రోడ్డుకు వెళ్లే రైళ్ల క్రాస్ మూమెంటన్ నివారిస్తుంది. ఇది రైళ్లను నిలుపుదల చేయకుండా, ఈ విభాగంలో రైళ్ల సజావుగా కదలికను సులభతరం చేస్తుంది.
డోర్నకల్ వద్ద ఉన్న రైల్ ఓవర్ రైల్ ప్రాజెక్ట్ (Rail Over Rail Project) లైన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా కీలకమైన విభాగంలో రద్దీని తగ్గించడంలో సహాయ పడుతుంది. మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టడానికి, నడపడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ ప్రాజెక్టు భద్రాచలం పరిసర ప్రాంతాల బొగ్గు బెల్ట్ ప్రాంతం నుండి బొగ్గు రవాణాకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.

