సీఎం పర్యటన ఏర్పాట్లపై పర్యవేక్షణ

బాసర (నిర్మల్ జిల్లా): ఈ నెల 6న, సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి బాసర క్షేత్రాన్ని సందర్శించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పోదనే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మరియు ఇతర అధికారులతో కలిసి సీఎం ఆలయంలో శంకుస్థాపన చేయనున్న స్థలాన్ని, పూజా కార్యక్రమాల ఏర్పాట్లను, అభివృద్ధి పనుల స్థలాలను పరిశీలించారు.

అనంతరం సుమారు రూ.180 కోట్లతో చేపట్టనున్న ఆలయ మాస్టర్ ప్లాన్‌ను కూడా సుదర్శన్ రెడ్డి సమీక్షించారు. తరువాత ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనను ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం బాసర ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, సర్పంచ్ వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ లక్ష్మణరావు, ఆలయ ఈవో విజయ రామారావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply