Mrunal Thakur | సీత‌కు మంచి రోజులు…. టాలీవుడ్, బాలీవుడ్ లో వ‌రుస మూవీలు !

రాజ‌మౌళి, క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్‌ల త‌ర‌హాలో టీవీ సీరియ‌ల్ నుంచి వెండితెర‌పై ప్ర‌త్య‌క్ష‌మైన మ‌రాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌. ‘సీతారామం’తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన మృణాల్ విభిన్న‌మైన పాత్ర‌ల‌ని ఎంచుకుంటూ క‌థానాయిక‌గా హిందీ, తెలుగు భాష‌ల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. మాతృభాష మ‌రాఠీలో సినిమాలు త‌గ్గించి కేవ‌లం హిందీ, తెలుగు భాష‌ల‌పైనే ప్ర‌త్యేక దృష్టిపెట్టింది. తెలుగులో న‌టించిన తొలి చిత్రం ‘సీతారామం’తో మంచి మార్కులు కొట్టేసిన మృణాల్ ప్ర‌స్తుతం ఆరు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తోంది.

అందులో రెండు తెలుగు సినిమాలు, నాలుగు హిందీ మూవీస్‌. ఇందులో ముందుగా అజ‌య్‌దేవ‌గ‌న్ న‌టిస్తూ నిర్మిస్తున్న ‘స‌న్నాఫ్ స‌ర్దార్ 2’ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. యాక్ష‌న్ కామెడీగా రూపొందుతున్న ఈ మూవీని జూలై 25న భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో మృణాల్ పంజాబీ అమ్మాయిగా క‌నిపించ‌నుంది. దీనితో పాటు హిందీలో మ‌రో మూడు సినిమాలు చేస్తోంది. హై జ‌వానీతో ఇష్క్ హోనా హై, తుమ్ హోతో, పూజా మేరీ జాన్ వంటి సినిమాల్లో న‌టిస్తోంది.

ఇక తెలుగులో అడివి శేష్ న‌టిస్తున్న ‘డెకాయిట్‌’ చేస్తోంది. శృతిహాస‌న్ త‌ప్పుకోవ‌డంతో ఆ అవ‌కాశాన్ని మృణాల్ ద‌క్కించుకుంది. ఇక ఈ సినిమాతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కిస్తున్న పాన్ వ‌ర‌ల్డ్ మూవీలోనూ మృణాల్ ఠాకూర్ న‌టిస్తోంది. దీపికా ప‌దుకునే మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ కూడా మ‌రో హీరోయిన్‌గా క‌నిపించ‌నుంది.

స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై క‌ళానిధి మార‌న్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ మృణాల్ ఠాకూర్ కెరీర్‌కు ఓ మైలురాయిలా నిలిచే అవ‌కాశం ఉంద‌ని, ఈ సినిమాతో స్టార్ హీరోయిన్‌ల జాబితాలో మృణాల్ చేరుతుంద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. హిందీతో పాటు తెలుగులోనూ క్రేజీ సినిమాల్లో న‌టిస్తూ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణాన్ని సాఫీగా సాగిస్తున్న మృణాల్ రానున్న రోజుల్లో భారీ విజ‌యాల్ని ద‌క్కించుకుని స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చేర‌డం ఖాయం.

Leave a Reply