Gantasala | 21న ఘంటసాల శత జయంతి

Gantasala | 21న ఘంటసాల శత జయంతి

శ్రీకాకుళంలో నిర్వ‌హ‌ణ‌

Gantasala | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : అర్ధ శతాబ్ద చరిత్ర గల విఖ్యాత సాహితీ సాంస్కృతిక సంస్థ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (హైదరాబాద్ ) ఈ నెల 21న నిర్వహించే ఘంటసాల ఆరాధన ఉత్సవాలకు శ్రీకాకుళం సంసిద్ధమవుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు పన్నెండు గంటలపాటు నిరవధికంగా కొనసాగే ఈ సంగీత మాధురి వేదిక బాలుతో పాటు- గురుశిష్యులైన బండారు చిట్టిబాబు, జి. ఆనంద్ లకు నివాళి సమర్పణగా ఏర్పాటవుతోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణ లోని రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి సౌజన్యంతో అనేక జిల్లాల నుంచి ప్రసిద్ధ కళాకారులెందరో వచ్చి గాత్ర మాధురిని అందిస్తారు. ఘంటసాల పురస్కారాన్ని ప్రముఖ గాయకుడు ఎన్. సి. కారుణ్యకు బహూకరించే వేదికగా అంబేద్కర్ ఆడిటోరియం సర్వ సన్నద్ధమవుతోంది. శ్రీకాకుళం తోపాటు విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్, తదితర ప్రాంతాల గాయక బృందాలు ఈ సంగీత ఆరాధనోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటాయి. అనంతరం విఖ్యాత కళావేత్తలతో నీరాజనం ఉంటుందని, వ్యాఖ్యాతలుగా రామారావు, శేఖర్, కామేశ్వరరావు, లలిత వ్యవహరిస్తారని, వాద్య సహకారాన్ని రమణమూర్తి బృందం అందిస్తుందని నిర్వాహక సంస్థ కార్యదర్శి మద్దాళి రఘురామ్ ప్రకటించారు.

ఘంటసాల నిర్విరామ ఆరాధనోత్సవాలను గత మూడు దశాబ్దాలుగా తెలుగునాట అనేక నగరాల్లో నిర్వహించామని, ప్రస్తుతం ఇంత విస్తృత స్థాయిన శ్రీకాకుళంలో ఏర్పాటవడం ఇదే ప్రథమమని ‘కిన్నెర’ ప్రకటించింది. ఈ వేడుకల సన్నాహాల్లో సంస్థ, సహకార బృందమైన కె. వి. సుబ్బారావు, మండవ వెంకట కామేశ్వరరావు, పి. జగన్మోహనరావు ( రెడ్ క్రాస్ చైర్మన్ – శ్రీకాకుళం), డాక్టర్ నిక్కు అప్పన్న, జంధ్యాల శరత్ బాబు నిమగ్నులయ్యారు.

Leave a Reply