అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
చంద్రబాబు వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలు
పాయకాపురం, ఆంధ్రప్రభ : పొట్టి శ్రీరాములు125వ జయంతి సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, సత్యనారాయణపురం 33వ డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. స్థానిక కార్పొరేటర్ మూర్తి, డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్, రాము, కొల్లూరు రామకృష్ణ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణత్యాగం..
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. గాంధీజీ బాటలో నడిచి, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన ఆయన చరిత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల విభజన విషయంలో చంద్రబాబు అనుసరించిన ‘రెండు కళ్ళ సిద్ధాంతాన్ని’ నేతలు తీవ్రంగా విమర్శించారు.
కేవలం అధికారం కోసం ఆయన రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సిద్ధపడ్డారని ఆరోపించారు. వివక్ష: అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేయాలని చూసిన చంద్రబాబు, పొట్టి శ్రీరాములు విగ్రహ ఏర్పాటుకు మాత్రం సామాజిక వర్గాల నిధులను ఆశ్రయించడం ఆయన వివక్షకు నిదర్శనమని మండిపడ్డారు. నవంబర్ 1 ప్రాముఖ్యత: గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఎన్నడూ నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని, ఇది అమరజీవి త్యాగాన్ని అవమానించడమేనని అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిబద్ధత రాజశేఖర్ రెడ్డి హయాంలోనే నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి గౌరవించుకున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా, తెలుగు జాతి కీర్తిని దశదిశలా చాటేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి స్టేట్ జనరల్ సెక్రెటరీ పేరం త్రివేణి రెడ్డి, కుక్కల రమేష్, శ్రీనివాస్, మైలవరపు రాము, కొల్లూరు రామకృష్ణ, భోగాది మురళి, కోలవెన్ను రమణ, చాంద్ తదితరులు పాల్గొన్నారు.
