మక్తల్, ఏప్రిల్ 28 (ఆంధ్రప్రభ) : ధాన్యం అమ్మకాలు చేసేందుకు గన్ని బ్యాగుల కోసం నిత్యం సింగిల్ విండో కార్యాలయానికి తిరుగుతున్నా గన్ని బ్యాగులు లభించక కడుపు మండిన రైతన్నలు రోడ్డెక్కారు. గంటసేపు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో రోడ్డుకు ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయి జాతీయ రహదారి స్తంభించిపోయింది. సింగిల్ విండో కార్యాలయం వద్ద గన్ని బ్యాగుల కోసం వారం రోజులుగా రైతులు రోజు తిరుగుతున్నా గన్ని బ్యాగుల కొరతతో లభించడం లేదని రైతులు తెలిపారు.
వారం రోజులుగా పనీ పాట వదులుకొని రోజూ తిరుగుతున్నా ఎందుకు ఇవ్వరని వారు అధికారులను నిలదీశారు. బ్యాగులు తక్కువగా వస్తుండడం వల్లే సమస్య ఏర్పడినట్లు సిబ్బంది తెలిపారు. బ్యాగులు దొరక్క ఆగ్రహించిన రైతులు ఇవాళ సింగిల్ విండో కార్యాలయం ఎదురుగా 167వ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక సీఐ రామ్ లాల్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సిఐ ఎంతగా నచ్చజెప్పినా రైతులు వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు.
ఉన్నతాధికారులతో మాట్లాడి గన్ని బ్యాగుల కొరత తీర్చే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతులు ఆందోళన విరమించిన అరగంట తర్వాత ఒక లారీ గన్ని బ్యాగులు మక్తల్ చేరుకున్నాయి. దీంతో గన్ని బ్యాగుల కోసం రైతులు ఎగబడడం కనిపించింది. అవసరానికి సరిపడా గన్ని బ్యాగులు అందడం లేదని పలువురు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి గన్ని బ్యాగుల కొరతను తీర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనకు బీజేపీ జిల్లా నాయకులు జి.బలరాం రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బెల్లం శ్రీనివాస్ రెడ్డి, బండారి ఆనంద్ మద్దతు తెలిపి రాస్తారోకో లో పాల్గొన్నారు.