ఫుడ్ పాయిజన్ ఘటనలతో వెయ్యి మందికి పైగా అనారోగ్యం
నల్లగొండ జిల్లాలో మరోసారి వెలుగులోకి కలుషిత ఆహారం ఘటన
తీవ్ర అస్వస్థతగురైన 35 మంది విద్యార్థులు
ఈ ఏడాది ప్రారంభంలోనే స్టూడెంట్స్‌కి చేదు అనుభవం
గత ఏడాదంతా వెంటాడిన కలుషిత ఆహారం ఘటనలు
హైకోర్టు సీరియస్‌గా తీసుకున్నా పరిస్థితిలో మార్పులేదు
పునరావృతం కాకుండా చూడాలంటున్న తల్లిదండ్రులు
సీఎం రేవంత్ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ ఏం చేస్తోంది?
హాస్టళ్ల తీరును ప్రశ్నిస్తున్న విపక్ష పార్టీల నేతలు
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
రెసిడెన్షియల్ స్కూళ్లకు (residential schools,) పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు (mother and father ) ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. గత ఏడాది (year ) కాలంగా విద్యార్థులను ఫుడ్ పాయిజన్ (food poison ) ఘటనలు వెంటాడుతూనే ఉన్నాయి. దీనిపై హైకోర్టు (high court ) కూడా సీరియస్ అయ్యింది. కానీ, గురుకుల పాఠశాలలో పరిస్థితి మాత్రం మారలేదు. గత ఏడాదిలో దాదాపు 1,000 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారినపడ్డారు. సుమారు 50 మంది విద్యార్థులు చనిపోయారు. గత అనుభవాలతో ప్రభుత్వానికి గానీ, ఆశ్రమ పాఠశాల నిర్వహకులకు గానీ, అధికారులకు గానీ గుణపాఠం రాలేదు. ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభించి నెల రోజులు కావొస్తుంది. కాగా, నల్లగొండ జిల్లాలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
రాత్రి బగరా రైస్.. ఉదయం పులిహోరా..
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి 35 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన జులై 12వ తేదీన జరిగింది. ఈ ఏడాదిలో తొలి ఘటన ఇది. బాలికల ఆశ్రమ పాఠశాలలో సుమారు 310 మంది విద్యార్థులున్నారు. ఆదివారం (12న) రాత్రి అల్పాహారంగా పెసర గుగ్గిళ్లను పెట్టారు. కొద్దిసేపటి తర్వాత బగారా, చికెన్‌తో భోజనం పెట్టారు. రాత్రి భోజనం తిన్న తర్వాత పాఠశాలలోని కొంతమంది విద్యార్థులు కడుపునొప్పి, విరేచనాలతో బాధపడ్డారు. సోమవారం (13న) ఉదయం అల్పాహారంగా పులిహోర వడ్డించారు. ఇది తిన్న అనంతరం 35మంది విద్యార్థినులు తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలతో బాధపడుతుండడంతో ఆందోళన చెందిన టీచర్లు, పాఠశాల ఏఎన్ఎం అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో అటు అధికారులు, ఇటు తల్లిదండ్రలు ఊపిరి పీల్చుకున్నారు.
ఫుడ్ పాయిజనింగ్ అరికట్టడంపై ఏదీ చిత్తశుద్ది..
తెలంగాణ ఆశ్రమ పాఠశాల్లో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కానరావడం లేదు. గతంలో జరిగిన ఫుడ్ పాయిజినింగ్ తీసుకున్న చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే మళ్లీ ఇలాంటి సంఘటన ప్రారంభమైంది. దీంతో ఆశ్రమ పాఠశాలలు అంటే విద్యార్థులు ఆమడ దూరం పరుగెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆశ్రమ పాఠశాలకు పిల్లలను పంపించడానికి తల్లిదండ్రుల సుముఖత వ్యక్తం చేశారు. తద్వారా డ్రాపౌట్స్ పెరిగే అవకాశం లేకపోలేదు.
పకడ్బందీ చర్యలు చేపట్టాలి
తెలంగాణ ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి. ఎందుకు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుందో ఒక కమిటీ ద్వారా తెలుసుకోవాలి. అవసరమైతే మెనూ మార్పు చేయాలి. అలాగే ప్రతి ఆశ్రమ పాఠశాలకు పౌర సరఫరాల విభాగం ద్వారా సరుకులు సరఫరా చేయాలి. ప్రధానంగా ఆయిల్ నాణ్యతపై ఎప్పటికప్పడు ఆహార కల్తీ అధికారులతో తనిఖీలు నిర్వహించాలి. ఫుడ్ పాయిజనింగ్ జరిగిన ఆశ్రమ పాఠశాలలో ప్రిన్సిపాల్, వార్డెన్, సిబ్బందిని బాధ్యులు చేసి చర్యలు తీసుకోవాలి. ఇలా చేయకపోతే ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు నిత్యం ఎక్కడో ఒక దగ్గర జరిగిన ఆశ్చర్యపోనవసం లేదు.
.
గత విద్యా సంవత్సరంలో కొన్ని సంఘటనలు
- జనవరి-2025 : నారాయణపేట జిల్లా ధన్వాడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 22 మంది విద్యార్థుల అస్వస్థత
- సూర్యాపేట జిల్లా గిరినగర్ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 12 మంది బాలికలు
- డిసెంబర్ 2024 : తాండూరు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 15 మంది బాలికలు
- మేడ్చల్-మల్కాజ్గిరి లో నాగరం మైనారిటీ గురుకుల పాఠశాలలో 33 మంది బాలికలు
- నవంబర్ -2024 : కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయానికి చెందిన దాదాపు 11 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు.
- మంచిర్యాల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల లో 14 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
- నారాయణపేటలోని మగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 21 – 26 మధ్య మూడు సంఘటనలు జరిగాయి, ఇందులో దాదాపు 30 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారు.
- అక్టోబర్ 2024 : వాంకిడి, కుమారం భీమ్ ఆసిఫాబాద్‌లోని ఆశ్రమ పాఠశాలలో దాదాపు 60 మంది విద్యార్థులు ఈ వ్యాధి బారిన పడ్డారు; ముగ్గురు నిమ్స్‌లో చేరారు. విద్యార్థిని సి. శైలజ మరణించారు.
- ఆగస్టు 2024 : జడ్చర్లలోని మైనారిటీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 40 మంది బాలురు వాంతులు , కడుపు నొప్పితో బాధపడ్డారు.
- నాగర్ కర్నూల్లోని రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 16 మంది బాలికలను ఆసుపత్రిలో చేర్చారు.
- జూలై 2024 : మెదక్ జిల్లా రామాయంపేట మోడల్ స్కూల్ ముడి బియ్యం కీటకాలతో కలుషితమయ్యాయి.
- మే 2024: జనగాం సమీపంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఏప్రిల్ 2024: కస్తూర్బా పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. - భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న బాలుడు మరణించాడు
- బాలుర హాస్టల్లో ఐదు మరియు ఆరు తరగతుల విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్తో బాధపడ్డారు.
===================