TG | సింగరేణి జాగృతి ఆవిర్భావం.. 11 కమిటీలు ఏర్పాటు చేసిన కవిత

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్న‌ట్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ క‌విత అన్నారు. ఈ జాగృతి ద్వారా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతామ‌న్నారు. మంగ‌ళ‌వారం ఉదయం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో సింగరేణి ఏరియా జాగృతి శ్రేణులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి జాగృతి కమిటీని ఏర్పాటు చేశారు. 11 ఏరియాలకు కో-ఆర్డినేటర్లను ఎమ్మెల్సీ కవిత నియమించారు.

కార్మికుల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా…
ఈసందర్భంగా క‌విత‌ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ టీబీజీకేఎస్‌తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తామన్నారు. బహుజనులు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేశామని ప్రకటించారు. సింగరేణి ప్రాంతంలో జాగృతి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి సింగరేణిని రక్షించుకున్నామని, అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో అంతం చేయాలని చూస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోడీ కోసం పని చేస్తున్నారని, అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్కమాట మాట్లాడటం లేదని విమర్శించారు.

Leave a Reply