RR | ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వృద్ధురాలు మృతి

కొత్తూరు, జులై 8 (ఆంధ్రప్రభ) : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మంగళవారం కొత్తూరు (Kothur) మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట మండల కేంద్రానికి చెందిన నారని అనసూయ (Anasuya) (63) తన కుమారుడు సుధాకర్, కోడలు విజయలక్ష్మి వద్ద గత కొన్ని రోజులుగా షాద్ నగర్ (Shad Nagar) లో నివాసం ఉంటున్నది. ఈ క్రమంలో అనసూయ తన కొడుకు సుధాకర్, కోడలు విజయలక్ష్మితో కలిసి షాద్ నగర్ నుండి హైదరాబాద్ కు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు.

ఈ క్రమంలో మార్గమధ్యలో కొత్తూరు సమీపంలోకి రాగానే ఎదలో నొప్పి వస్తుందని అనసూయ చెప్తుండటంతోనే ఉలుకు పలుకు లేకుండా పడిపోయింది. ఇది గమనించిన ఆర్టీసీ సిబ్బంది ఆమెను కొత్తూరులో నడిరోడ్డుపై దింపేసి వెళ్లిపోయారు. దీంతో సుధాకర్ 108కి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది రోడ్డుపైనే సీపీఆర్ చేసినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండాపోయింది. అనసూయ మృతి చెందిందని 108 సిబ్బంది నిర్ధారించంటంతో కొడుకు, కోడలు రోదనలు మిన్నంటాయి. వారిని చూసి అక్కడే ఉన్న ప్రయాణికులు, స్థానికులు సైతం రోధించసాగారు. ఈ హృదయ విదారక సంఘటనను చూసి కన్నీరుమున్నీరయ్యారు. చేసేది ఏమిలేక తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి అక్కడి నుండి ఓ ప్రైవేట్ వాహనంలో తమ ఇంటికి తీసుకువెళ్లారు.

Leave a Reply