గాలివాన బీభత్సం నేలకొరిగిన పంట

గాలివాన బీభత్సం నేలకొరిగిన పంట

  • వందల ఎకరాల్లో నష్టం, అన్నదాతల కష్టాలు వర్ణనాతీతం
  • తక్షణ సర్వే చేసి పరిహారం చెల్లించాలంటూ రైతుల విజ్ఞప్తి

దండేపల్లి, ఆంధ్రప్రభ : గాలివాన బీభత్సవంతో నేలకొరిగిన మొక్కజొన్న కొద్దిదరుడు పంటలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దండేపల్లి మండలంలో అకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన వర్షం రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. గంటపాటు విరుచుకుపడిన గాలివాన బీభత్సంతో వందల ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న,మామిడి పంటలు నేలకొరిగిపోయాయి. కోత దశకు చేరుకున్న పంటలు కళ్లముందే కూలిపోవడంతో రైతులు ఆవేదనలో మునిగిపోయారు.


ముఖ్యంగా మామిడి కాయలు,పిందెలు పూర్తిగా నేలకూలిపోవడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న కంకులు నేలమట్టమవడంతో పంట నాణ్యత దెబ్బతింటుందని చెబుతున్నారు. అప్పులు చేసి ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేసిన పంటలు ఇలా నష్టపోవడం తమకు పెద్ద దెబ్బ అని రైతులు వాపోతున్నారు.గాలివాన ప్రభావంతో పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడగా, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. కొన్ని గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రామాల్లో ఎక్కడ చూసినా నేలకొరిగిన పంటలే కనిపిస్తున్నాయి.

ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగి రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ప్రకృతి వైపరీత్యం మరింత భారంగా మారిందని వారు అంటున్నారు. బ్యాంకు రుణాలు, వ్యక్తిగత అప్పులతో సాగుచేసిన పంటలు దెబ్బతినడంతో తిరిగి నిలబడటానికి ప్రభుత్వ సహాయం అవసరమని పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా రైతుకు సహాయం చేస్తే బాగుండేదని ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడం ఆలస్యం అవడంతో రైతులకు పెట్టుబడి సహాయం కూడా అందడం లేదు. ప్రభుత్వం సమయానికి రైతు భరోసా ద్వారా పెట్టుబడి సహాయం చేస్తే ఇలాంటి సందర్భాలలో రైతులకు ఎంతో మేలు కలుగుతుంది.
ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక బృందాలను పంపించి పంటల నష్టం అంచనా వేయాలని, ఎకరాకు సరైన పరిహారం ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట బీమా పథకం కింద తక్షణమే సహాయం చేసి రైతు సమస్యలను పరిష్కరించాలని, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధిత రైతులకు అండగా నిలవాలని కోరుతున్నారు. ప్రకృతి ఆగ్రహంతో అన్నదాతల కష్టాలు మళ్లీ పెరిగాయి. పంటలపై ఆశలు పెట్టుకున్న రైతులు ఇప్పుడు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

చేతికొచ్చిన పంట గాలివానతో పూర్తిగా దెబ్బతిన్నది: రైతు బారతరపు రాజన్నతనకున్న వ్యవసాయ పొలంలో 1.20 భూమిలో మొక్కజొన్న పంటను సాగు చేశాను. పంటను విత్తనం వేసిన నాటి నుంచి కంటికి రెప్పలా క్రిమి కీటకాలు, చీడపురుగుల నుంచి ఎరువులు క్రిమిసంహారక మందులు ఉపయోగించి పంటను కాపాడుకున్నాం. వేలకు వేలు పెట్టుబడి పెట్టి ఆరుకాలం కష్టపడి పంటను కాపాడి తీరా కోతకు వచ్చే సమయంలో గాలివాన బీభత్సంతో పంట మొత్తం నేలకొరిగింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తక్షణమే దెబ్బతిన్న పంటలను సర్వే చేసి పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.


ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతున్నారు:కమ్మల సాయి కుమార్, కౌలు రైతుకొండాపూర్
ప్రకృతి వైపత్యాల వల్ల రైతుల నష్టపోవడం జరుగుతుందని అకాల వర్షాలతో పంట నష్టం జరిగింది. తిమ్మక్ పల్లి గ్రామంలో 5 ఎకరాల వ్యవసాయం భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. యాసంగి సీజన్ లో 5 ఎకరాలు మొక్కజొన్న పంట సాగు చేయగా,గాలి బీభత్సం తో మొక్కజొన్న పంట నేలకొరిగింది. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తే, ఇలా అకాల వర్షంతో పంటలు దెబ్బతింటే, అటు భూమి యజమానికి కౌలు ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకునే నష్టపరిహారం చెల్లించాలన్నారు.
అధికారులు స్పందించి వెంటనే పంటల సర్వేలు చేయాలి,ఇప్ప సురేందర్ మాజీ ఎంపిటిసి, కొండాపూర్ గ్రామంలో రైతులు యాసంగికి పంటలకు నీరు సరిగ్గా అందకపోవడంతో గ్రామంలో మొక్కజొన్న పంటలు వేస్తారు.ప్రకృతి కన్నెర్ర చేయడంతో పంటలు పూర్తిగా నేలకొరిగాయి, దీనితో రైతులు తీవ్రంగా నష్టపోయారని వ్యవసాయ అధికారులు పూర్తి స్థాయిలో సర్వేలు నిర్వహించి రైతులను ఆదుకోవాలి.


పంట నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక పంపించాం: మండల వ్యవసాయ అధికారి గోర్ల అంజిత్ కుమార్


దండేపల్లి మండల పరిధిలోని కొండాపూర్, ద్వారక, పెద్దపేట, లక్ష్మీకాంతపూర్, నెల్కి వెంకటాపూర్, కొర్విచెల్మ గ్రామాల పరిధిలోని సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా కిందపడి నష్టం జరిగిన మామిడి , మొక్కజొన్న పంటలను పరిశీలించటం జరిగింది. మండల పరిధిలో మొత్తం ప్రాథమికంగా సుమారు మొక్కజొన్న సుమారు 952ఎకరాలలో నష్టం జరిగినట్లు అంచనా వెయ్యటం జరిగింది.ఈ సర్వే నివేదికను జిల్లా అధికారులకు పంపించడం జరుగుతుంది. తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.

Leave a Reply