DSP Kolikepudi Pramod | రూ.1.09 కోట్లు స్వాహా..

DSP Kolikepudi Pramod | రూ.1.09 కోట్లు స్వాహా..

  • వైద్య శాఖలో భారీ కుంభకోణం
  • జీతం నకిలీ బిల్లులు
  • ప్రభుత్వ నిధుల దుర్వినియోగం
  • ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

DSP Kolikepudi Pramod | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తూ పై అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ వేలి ముద్రలు, నకిలీ సీల్స్ తయారు చేసి బోగస్ బిల్లులు సృష్టించి సుమారు 1,09,45,339 రూపాయల ప్రభుత్వ నిధులను అక్రమంగా సొంత అవసరాలకు వినియోగించుకుని స్వాహా చేసిన కేసులో ఆళ్లగడ్డ పోలీసులు (Police) ముద్దాయిని శుక్రవారం అరెస్ట్ చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆళ్లగడ్డ డీఎస్పీ కొలికేపూడి ప్రమోద్ తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల జిల్లాలోని అహోబిలం, నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పఠాన్ ఇతియాజ్ అలీఖాన్ నకిలీ జీతపు బిల్లులు సృష్టించి సుమారు 1,09,45,339 రూపాయలను అక్రమంగా డ్రా చేసినట్లు గుర్తించారు. డిసెంబర్ నెలలో ఏజీ ఆడిట్‌లో ఈ భాగోతం బయటపడింది. జిల్లా ట్రెజరీ అధికారి లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు.

డీఎస్పీ (DSP) తెలిపిన వివరాల మేరకు ఏ వన్ ముద్దాయి పఠాన్ ఇంతియాజ్ అలీ ఖాన్ 2019 నుంచి 2025 వరకు అహోబిలం, నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసినట్లు వెల్ల‌డైందన్నారు. ముద్దాయి తండ్రి మెడికల్, హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో అటెండర్‌గా పనిచేస్తూ 2013 సెప్టెంబర్ 16వ తేదీన సంబంధిత గుండె వ్యాధితో మరణించాడు. ముద్దాయి 2015 జనవరి 23వ తేదీన కారుణ్య నియామకంతో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరాడు.

సులభంగా డబ్బు సంపాదించాలన్న దురుద్దేశంతో అహోబిలం నర్సాపురంలో (Narsapuram) పనిచేస్తున్న డాక్టర్ ముని సుధావాణి, డాక్టర్ నాగదాసయ్యని మెడికల్ ఆఫీసర్లకు సంబంధించిన నకిలీ వేలిముద్రలను ఎంసీలను, ఫెవికాల్‌ను ఉపయోగించి వారికి తెలియకుండానే తయారు చేశాడని తెలిపారు. నకిలీ సీఎఫ్ఎంఎస్ ఐడీలను అక్రమంగా సృష్టించాడని తెలిపారు. వాటి ద్వారా రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన రెగ్యులర్, కాంట్రాక్టు సిబ్బందికి సంబంధించిన జీత బిల్లులు ప్రసూతి సెలవు బిల్లులు శిక్ష ట్రావెలింగ్ అలవెన్స్ బిల్లులను నకిలీవిగా తయారు చేశారు. నకిలీ సంతకాలు పెట్టి జిల్లాలోని ఆళ్లగడ్డ సప్తగిరి కార్యాలయానికి సమర్పించి మోసపూరితంగా బిల్లులను వాచ్ చేయించుకున్నారు.

సుమారు 93 నకిలీ బిల్లుల ద్వారా డబ్బులు చేసుకున్నారు. ఇందులో 1,00,16,901 రూపాయలను తన సోదరి ఖాతాకు జమ చేశారు. మిగిలిన 9,28,438 రూపాయలను తమస్ బ్యాంకు (Bank) ఖాతాకు జమయ్యేలా బిల్లులు పార్క్ చేయించుకున్నాడు. బిల్లులు సప్తగిరి కార్యాలయంలో మంజూరైన అనంతరం నకిలీ బిల్లులను రక్షించి కాలువలో పడేసి నకిలీ సీల్స్ కాల్చివేసి ఆధారాలను నాశనం చేశాడని డీఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరన్ ఆదేశాల మేరకు ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముద్దాయి నుంచి నకిలీ వేలిముద్రలు, ల్యాప్‌టాప్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రమోద్ తెలిపారు.

Leave a Reply