ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (StockMarket) లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. జాక్సన్ హోల్ సింపోజియంలో అమెరికా ఫెడ్ చీఫ్ వడ్డీ రేట్లపై ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనే దానిపై మదుపర్లలో ఆసక్తి నెలకొంది. దీనికితోడు భారత్‌పై ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ (Trump) విధించిన 25 శాతం అదనపు సుంకాల బాదుడు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది. ఈ గడువు దగ్గర పడడంతో వారాంతంలో మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. దీంతో మార్కెట్ సూచీల ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ (Sensex) దాదాపు 700 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ (Nifty) మళ్లీ 25 వేల స్థాయి దిగువన ముగిసింది.
సెన్సెక్స్ ఉదయం 81,951.48 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 82,000.71) నష్టాల్లో ప్రారంభమైంది (loss Started ). రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడే (Intraday) లో 81,291.77 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 693.86 పాయింట్ల నష్టంతో 81,306.85 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 213.65 పాయింట్ల నష్టంతో 24,870.10 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.53గా ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్ (Asian Paints), అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, సన్‌ఫార్మా, బీఈఎల్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 67.46 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 3,329.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
సెప్టెంబర్‌లో జరిగే పరపతి విధాన సమీక్షలో ఫెడ్ 25 బేసిస్ పాయింట్లు (Basis points) వడ్డీ రేట్లు కట్ చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై ఈ రాత్రికి జరిగే జాక్సన్ హోల్ సింపోజియంలో జెరోమ్ పావెల్ ఏదైనా వ్యాఖ్యలు చేస్తారని మదుపర్లు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అమెరికా వడ్డీ రేట్లు తగ్గిస్తే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు కలిసొస్తుంది.