కనుమరుగవుతున్న మడ అడవులు..

కనుమరుగవుతున్న మడ అడవులు..
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : తీర ప్రాంతంలో మడ అడవులు ప్రాముఖ్యత ఎంతగానో ఉంది. మడ అడవులు తీర ప్రాంతంలో పెట్టని కోట వలె సముద్రం అలలు, తుఫాన్ నుండి తీర ప్రాంతంను రక్షిస్తాయి. సముద్ర తీర ప్రాంతంలో పెరుగుతున్న మడ అడవులు సముద్రపు అలలను నియంత్రిస్తాయి. సముద్ర తీర ప్రాంతంలో పెరుగుతున్న జీవన వైవిధ్యాన్ని రక్షిస్తాయి. అనేక సముద్ర ప్రాణులకు ఆవాసాలుగా ఉంటున్నాయి. అలాంటి మడ అడవులకు నేడు రక్షణ కరువైంది. సముద్ర తీరం ప్రాంతంలో ఎంతగానో ఉపయోగపడుతున్న సహజ సిద్ధమైన మడ అడవులను కబ్జాదారులు యదేచ్చగా ఆక్రమించుకుంటున్నారు.
మచిలీపట్నం మండలంలో ప్రభుత్వ మడ భూములను కబ్జా చేస్తున్నారు. పెదపట్నం, కానూరు గ్రామంలో ప్రభుత్వ మడ అడవులను నరికి చెరువులుగా మారుస్తున్నారు. రక్షిత మడ అడవులను తొలగిస్తూ యదేచ్చగా ఆక్రమణకు పాల్పడుతున్నారు. కబ్జాదారుల వల్ల మడ భూములు కనుమరుగైపోతున్నాయి. రాజకీయ నాయకుల అండదండలతో కబ్జాదారులు మడ భూములను ఆక్రమణలకు పాల్పడుతున్నారని అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.
బందరు మండలంలో 10, 280 హెక్టార్లు మడ అడవులు ఉన్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. అయితే.. వీటిని కొంత మంది కబ్జాదారులు అక్రమంగా ఆక్రమణలకు పాల్పడుతూ చెరువులుగా మారుస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో ఉన్న మడభూములు 50 శాతంకు పైగా ఆ గ్రామాలకు సంబంధించిన నాయకులు ఆక్రములకు పాల్పడ్డారని అనేక ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీ నాయకులు మడ అడవులను నరికి చెరువులుగా మార్చి లక్షలు సంపాదిస్తున్నారు. ఇంకొంతమంది నాయకులు మడ అడవులను నరికి చెరువులుగా చేసి వాటిని అమ్ముకొని కోట్ల రూపాయలు దండుకున్నారని విమర్శలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ప్రభుత్వ లెక్కల్లో ఉన్న మడ అడవులు ప్రస్తుతం సగానికి పైగా ఆక్రమణకు గురైంది అనటంలో సందేహమే లేదు.
మచిలీపట్నం మండలంలో మడ అడవులు హాట్ స్పాట్ కేంద్రంగా కొనసాగుతున్నాయి. దాదాపు వందల ప్రాణుల జీవన వైవిధ్యం కలిగిన సంరక్షణ కేంద్రంగా మచిలీపట్నం తీర ప్రాంత మడ అడవులు ఉన్నాయి. మడ అడవులు సంరక్షణ బాధ్యతను జిల్లా అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు చూసుకోవాలి . మడ అడవులను సంరక్షించడానికి ప్రతిరోజు జిల్లా అటవీశాఖ సిబ్బంది గస్తీ నిర్వహించి ఆక్రమణలకు పాల్పడకుండా చూడాల్సి ఉంది. అయితే జిల్లా అటవీ శాఖ లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తూ ఉండటంతో గస్తీని నిర్వహించడం లేదు. ఉన్న సిబ్బంది కార్యాలయంకు పరిమితం అవుతున్నారు. ఇది అక్రమదారుల పాలిట వరంగా మారింది. దీనిని ఆసరాగా తీసుకొని ఇటీవల కొంత మంది కబ్జాదారులు పెదపట్నం, కానూరు ప్రాంతాలలో మడలను నరికి అక్రమ చెరువులు తవ్వకాలకు పాల్పడుతున్నారు.
కబ్జాదారులు మడ అడవుల తొలగింపు పై రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. మడ అడవులను నరుకుతున్న సమాచారం రెవిన్యూ సిబ్బంది దృష్టికి వచ్చినా వాటి పై చర్యలు లేవు. మడ అడవులను తొలగిస్తున్న వారి పై గాని, నరకడానికి ఉపయోగించిన జెసిబి పై కానీ ఎటువంటి కేసులు నమోదు చేయటంలేదు. మడ అడవులను తొలగిస్తున్న జెసిబిను పట్టుకొని, వదిలేయటం స్థానికంగా తీవ్ర దుమారం రేగుతోంది. ప్రస్తుతం మడ చెట్లు ఉన్న ప్రాంతాన్ని పగలు, రాత్రి తేడా లేకుండా జెసిబిను ఉపయోగిస్తూ చెరువులను తవ్వేస్తున్నారు.
మచిలీపట్నం నార్త్ మండలంలో పెద్దపట్నం, కానూరు, తాళ్లపాలెం, జొన్నల వారి మోడీ, కరగ్రహారం, గిలకలదిండి, బందరు కోట ప్రాంతాలలో ఇప్పటికే కొంతమేర మడ అడవులు కబ్జా అయినట్లు, అస్సలు ప్రభుత్వ లెక్కలలో ఉండాల్సిన మడ అడవులు కంటే సగానికి పైగా ఆక్రమణకు గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎంత మేర ప్రభుత్వ మడ అడవులు ఆక్రమణ జరిగిందో పూర్తిస్థాయిలో అధికారులు సర్వే నిర్వహించాలి. ప్రస్తుతం ఉన్న మడ అడవులను అధికారికంగా ప్రకటించాలి. మడ అడవులను ఆక్రమించుకుని వాటిని చేపలు, రొయ్యలు చెరువులుగా మార్చి కొందరు పెద్దలు అమ్ముకోవడం, లీజుకు ఇస్తున్న వైనం అధికారంలో ఉన్న వారికి తెలియదా? అనే ప్రశ్న అనేక మందిలో కలుగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మడ అడవులను సంరక్షించాలి. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న మడ అడవులను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అక్రమంగా మడ అడవులను నరికి, చెరువులుగా మారుస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
