కరడుగట్టిన నేరస్తులను మించి హత్యలు
తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలని సూచన
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కొద్దిరోజుల క్రితం జరిగిన సహస్ర హత్యోదంతం చాలామందిని కలవరపెట్టింది. ఓ పదేళ్ల అమ్మాయిని ఇంత కిరాతకంగా చంపిన బాలుడు 10వ తరగతి చదువుతున్న విద్యార్థి కావడం ఈ విషయాన్ని మరింత ఆందోళనకరంగా మార్చింది. ఇలాంటి సంఘటనలకు కారణాలు ఏంటి, ఇలాంటి హింసా ప్రవృత్తిని ఎలా తగ్గించవచ్చో నిపుణులు విశ్లేషిస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలు ఇలా మారడానికి ఓటీటీలు, క్రైమ్ సీరియల్స్ ఒక్కటే కారణం కాదు. చాలా సందర్భాలలో ఆర్థిక సమస్యలు, కుటుంబంలో తగిన ప్రేమ, ఆప్యాయత లేకపోవడం, తల్లిదండ్రులు పిల్లలకు తగినంత సమయం కేటాయించకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా గుర్తించారు. ఉదాహరణకు, సహస్రను చంపిన బాలుడి తండ్రి తాగుబోతు, తల్లి రోజు మొత్తం పనికి వెళ్లడం వల్ల ఆ బాలుడిపై ఎవరూ శ్రద్ధ పెట్టలేదు. తోటి స్నేహితులతో పోలిస్తే తనకి ఏమీ లేకపోవడంతో, ఆ బాధలో ఎలాగైనా డబ్బు సంపాదించాలని దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు.
మైక్రో ఫ్యామిలీలు..
ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై మైక్రో కుటుంబాలు పెరిగిపోతుండడం కూడా పిల్లల పై ప్రభావాన్ని కనబరుస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవని ఏ సమస్య వచ్చినా అంతా కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకునే వారన్నారు. చిన్నవాళ్లు పెద్దల మాటకు గౌరవం ఇచ్చేవారని చెప్పారు. పండుగలు, శుభకార్యాలు అంతా కలిసి జరుపుకునేవారని, అదే సమయంలో ఏదైనా విషాదం జరిగితే ఒకరికొకరు తోడుగా నిలబడేవారని తెలిపారు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలకు బంధాలు, అనుబంధాల ప్రాధాన్యత చిన్నప్పటి నుంచే ఆటోమేటిక్ గా తెలిసిపోయేదని వివరించారు.
ఈ తరహా నేరాలను నివారించడానికి తల్లిదండ్రులు తమ పిల్లల మీద ఒక కన్ను వేసి ఉంచాలి. వారు ఏం చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి ఫోన్లను వాడుతున్నారు వంటి విషయాలను గమనించాలి. వారికి మంచి, చెడుల మధ్య తేడాను వివరించాలి. ఎంత బిజీగా ఉన్నా, రోజుకి కనీసం రెండు గంటలైనా పిల్లలతో గడపడం చాలా ముఖ్యం. వారి సమస్యలను అర్థం చేసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. అప్పుడే వారిలో హింసా ప్రవృత్తి తగ్గి, నేరాలకు దూరంగా ఉంటారు.