కర్నూలులో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్…

కర్నూలులో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్…
48 వాహనాలు స్వాధీనం
ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా మాదకద్రవ్యాలపై పోలీసుల కఠిన చర్యలు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో సరైన పత్రాలు లేని 48 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్ ఆదేశాల మేరకు, ఈగల్ ఐజి ఆకే రవి కృష్ణ ఐపిఎస్ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పోలీసు సబ్ డివిజన్లలో ఈ ఆపరేషన్ నిర్వహించారు.
పత్తికొండ సబ్ డివిజన్ పరిధిలో తుగ్గలి మండలం రామళ్ల గ్రామంలో, ఎమ్మిగనూరు సబ్ డివిజన్లో కడివెళ్ల గ్రామంలో, ఆదోని సబ్ డివిజన్లో ఆదోని పట్టణంలో, కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో కర్నూలు నగరం, బి. తాండ్రపాడు, టీవీ9 కాలనీల్లో పోలీసులు కార్డన్ సెర్చ్‌లు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 240 మంది పోలీసులు పాల్గొని సుమారు 2 వేల మంది వ్యక్తులను తనిఖీ చేశారు. అలాగే 400 వాహనాలను పరిశీలించి, పత్రాలు లేని 48 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన దుష్పరిణామాలను వివరించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడితే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని పోలీసులు హెచ్చరించారు.

ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో, పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలతో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని అధికారులు పేర్కొన్నారు.

ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేసిన పోలీసులు, మాదకద్రవ్యాలను పూర్తిగా అరికట్టడమే తమ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ డిఎస్పీ వెంకట్రామయ్య, ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి, కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, సిఐలు, ఎస్సైలు, ఈగల్ టీం సిబ్బంది పాల్గొన్నారు.

