గురుకుల కళాశాలపై కలెక్టర్ దీపక్ తివారి ఆకస్మిక తనిఖీ

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిపల్లి శివారెడ్డిపేటలో ఉన్న సామాజిక సంక్షేమ గురుకుల కళాశాలను జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన, విద్యార్థులకు అందిస్తున్న భోజన సదుపాయాలపై ప్రిన్సిపాల్ రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వయంగా వంటశాలకు వెళ్లి వంటలు ఎలా సిద్ధం చేస్తున్నారో పరిశీలించి, సంబంధిత సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
