CM | ఆరోగ్యశ్రీ బకాయిలపై స్పష్టత..

CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వైద్య సేవలను మరింత మెరుగుపరచడానికి విదేశాల్లో నిపుణులైన వైద్యుల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో వైద్య రంగానికి సంబంధించిన అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు గత ప్రభుత్వ కాలం నుంచి వచ్చాయని పేర్కొన్న సీఎం, ప్రతి నెల సగటున రూ.89 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.240.11 కోట్లు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.360.16 కోట్ల బకాయిలు ఉన్నాయని వెల్లడించారు.
ఇప్పటివరకు తమ ప్రభుత్వం మొత్తం రూ.2408.51 కోట్లు చెల్లించిందని, అందులో ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.927 కోట్లు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.1,480 కోట్లు చెల్లించినట్లు వివరించారు. అలాగే గతంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, రూ.2046 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. గత 27 నెలల్లో పేదల వైద్యం కోసం రూ.4,500 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.
టీచింగ్ కాలేజీలకు రోగులు తగ్గుతున్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం, వాటి నిర్వహణను గ్రూప్-1 అధికారులకు అప్పగించే ప్రతిపాదన ఉందన్నారు. అదనంగా, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించే కొత్త పథకాన్ని కూడా ప్రభుత్వం తీసుకువచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
