Casino | హైదరాబాద్ శివార్లలో కాసినో.. ఫామ్ హౌజ్ పై పోలీసుల దాడి
- కోడి పందాలతో పాటు ప్లే కార్ట్స్
- పోలీసుల అదుపులో 64మంది.. 55 లగ్జరీ కార్లు సీజ్
- 86 పందెం కోళ్లు, 46 కోడికత్తులు స్వాధీనం
- రూ.30లక్షలకు పైగా నగదు పట్టివేత
హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో కోడిపందేలు, క్యాసినో నిర్వహణ గుట్టురట్టయ్యింది. క్యాసినో, కోడిపందాలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. కోళ్ల పందాలతో పాటు క్యాసినో నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో మొత్తంగా 64మందిని అదుపులోకి తీసుకోగా.. ఇందులో ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్ కూడా ఉన్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు ప్రముఖులు క్యాసినో, కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
మొయినాబాద్ తోల్కట్టలోని ఫామ్‌హౌస్‌పై దాడిలో 30లక్షల రూపాయల నగదు, 55లగ్జరీ కార్లు, 86పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డ్స్, పందెం కోళ్ల కోసం వాడే 46కోడి కత్తులను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించేశారు. యూపీఐ ట్రాన్సక్షన్ల కోసం ఆర్గనైజర్లు స్కానర్లు వినియోగించినట్లు పోలీసులు తేల్చారు. యూపీఐ ద్వారా భారీగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. క్యాసినో, కోడిపందేల కోసం ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేశారు. కోడిపందేల్లో విడతల వారీగా 200 మంది దాకా పాల్గొన్నట్టు సమాచారం. ఇక ఈ క్యాసినో పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
