- విద్యా శాఖ సమీక్ష సమావేశం
- మౌలిక సదుపాయాల కల్పన
- 2026 జూన్ నుంచి కార్యాచరణ అమలుకు ప్రణాళికలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు
రాష్ట్రంలోని విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో, వచ్చే విద్యా సంవత్సరం (2026 జూన్) నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని స్పష్టం చేశారు.
విద్యారంగంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి. బాలకిష్టా రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు..
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రణాళికలు ఉండాలని, తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ప్రాంతంలో దృష్టి సారించాలని చెప్పారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూళ్లకన్నా మెరుగ్గా ఉండేలా చూడాలని, ప్లే గ్రౌండ్‌లు, అవసరమైన తరగతి గదులతో పాటు మంచి వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి విద్యా శాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలకు తరలించాలని సూచించారు.
పైలట్ ప్రాజెక్ట్ గా..
నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు కొత్త పాఠశాలలను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ పాఠశాలల్లో కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అన్ని వసతులతో కూడిన విద్యను అందించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

