Bellampalli | ఎన్నికలప్పుడే ప్రజా ప్రతినిధులకు గుర్తొస్తాయ్…

Bellampalli | ఎన్నికలప్పుడే ప్రజా ప్రతినిధులకు గుర్తొస్తాయ్…
- బెల్లంపల్లిలో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు కలగానే..
- సగం మందికే సింగరేణి పట్టాలు..
- కలగానే ఆర్టీసీ బస్సు’డిపో’
Bellampalli | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి గడ్డపై మున్సిపల్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. రాజకీయం రసవత్తరంగా మారుతున్నా.. సామాన్యుడి గోడు మాత్రం వినేవారే కరువయ్యారు. దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని సమస్యలు, నేతలకు అలవాటుగా మారిన అబద్ధపు హామీలే ఈసారి ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మారనున్నాయి. పారిశ్రామికంగా ఓ వెలుగు వెలిగిన ఈ ప్రాంతం, నేడు కనీస మౌలిక సదుపాయాల కోసం అల్లాడుతుండటం గమనార్హం.
అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాయాలు…
పట్టణంలోని అత్యంత కీలకమైన సబ్ కలెక్టర్, ఏసీపీ, తహసీల్దార్ వంటి ప్రధాన కార్యాలయాలకు నేటికీ సొంత భవనాలు లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లోనే కాలం వెళ్లదీస్తుంటే, ఇక సామాన్యుడికి శాశ్వత పరిష్కారాలు ఎక్కడ దొరుకుతాయని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థులు బీ-ఫామ్ ల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు కానీ, కార్యాలయాలకు భవనాలు నిర్మించే విషయంపై నోరు మెదపడం లేదు.
ఉన్నత విద్య.. అందని ద్రాక్షే!
పక్కనే ఉన్న మంచిర్యాలలో మెడికల్ కాలేజీలు వెలుస్తున్నా, బెల్లంపల్లికి మాత్రం మొండిచేయే మిగులుతోంది. ఇక్కడ ఒక మెడికల్, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్నది కార్మిక బిడ్డల దశాబ్దాల కల. పైచదువుల కోసం హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలకు వలస వెళ్లలేక పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. ఉన్న పాలిటెక్నిక్ కాలేజీని అప్‌గ్రేడ్ చేస్తామన్న హామీ ఎన్నికల మేనిఫెస్టోలకే పరిమితమైంది.
పట్టాల పంచాయతీ.. సగమేనా?
సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న వారికి నివాస హక్కులు కల్పిస్తామని గొప్పగా చెప్పుకున్న పాలకులు, కేవలం 50 శాతం పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగిలిన సగం మంది పరిస్థితి ఏంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. “మా ఓట్లు కావాలి కానీ, మాకు పట్టాలు వద్దా?” అని నిరుపేదలు అభ్యర్థులను నిలదీస్తున్నారు.
బస్సు డిపో.. ఎప్పుడొచ్చేను?
బెల్లంపల్లి ప్రజల మరో ప్రధాన డిమాండ్ ఆర్టీసీ డిపో. మేడారం జాతర వంటి సమయాల్లో 79 ప్రత్యేక బస్సులు నడిపే స్థాయిలో ఆదాయం వస్తున్నా, సొంత డిపో లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ప్రతి ఎన్నికల్లోనూ ‘డిపో తెస్తాం’ అని వచ్చే నేతలను చూసి ప్రజలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు.
