భారత బీచ్ వాలీబాల్ జట్టుకు క్రీడాకారుల ఎంపిక

భారత బీచ్ వాలీబాల్ జట్టుకు క్రీడాకారుల ఎంపిక

చైనీస్ తైపీ వేదికగా జరిగే ఏవీసీ ఆసియన్ బీచ్ వాలీబాల్ టూర్‌లో ప్రాతినిధ్యం వహించనున్న రామకృష్ణంరాజు, కృష్ణ చైతన్య

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ :భారత పురుషుల బీచ్ వాలీబాల్ జట్టుకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. కాళ్ళ మండలం జక్కరం గ్రామానికి చెందిన ముదునూరి రామకృష్ణంరాజు, భీమవరం మండలం వెంప గ్రామానికి చెందిన పెన్మత్స కృష్ణ చైతన్యలు జాతీయ జట్టులో స్థానం సంపాదించారు.

వచ్చే నెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు చైనీస్ తైపీ వేదికగా జరగనున్న ఏవీసీ సీనియర్ ఆసియన్ బీచ్ వాలీబాల్ టూర్‌లో ఈ ఇద్దరు క్రీడాకారులు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.

రామకృష్ణంరాజు హైదరాబాద్‌లో కస్టమ్స్ అండ్ జీఎస్టీ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తుండగా, కృష్ణ చైతన్య సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్నారు. ఇద్దరూ గత అనేక సంవత్సరాలుగా భారత బీచ్ వాలీబాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించి దేశానికి కీర్తి తెచ్చారు.

ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యవామ, కార్యదర్శి రాఘవేంద్రరావు, ట్రెజరర్ ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పవన్ కుమార్ రాజు, జాయింట్ సెక్రటరీలు రామ్ కుమార్, సురేష్ తదితరులు క్రీడాకారులను అభినందించారు. క్రీడాభిమానులు, శ్రేయోభిలాషులు వారికి రాబోయే పోటీల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Leave a Reply