మహిళా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

మచిలీపట్నం, ఆంధ్రప్రభ ; అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల సందర్భంగా కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం మచిలీపట్నం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మచిలీపట్నం మహిళా పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది.
మహిళల భద్రత, సమాన హక్కులు, మహిళలపై జరిగే అఘాయిత్యాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మహిళల గౌరవం, రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు కూడా ర్యాలీలో పాల్గొని మహిళా సాధికారతపై నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ర్యాలీ అనంతరం మహిళల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు పోలీసులు సూచనలు అందించారు.
