AP | ఫైళ్ల పెండింగ్‌పై బాబు సీరియస్ – రెడ్ టేపీజంపై సీఎం గరం గరం
ఆర్ధికేతర పైళ్లు అస్సలు ఆగకూడదు
అధికారులతో సమీక్షలో సీరియస్ వార్నింగ్
ఆర్థికపరమైన అంశాలపై చర్చ
ఆరు నెలలు, ఏడాది పెండింగ్ ఎందుకు
క్లియర్ కాకుండా ఎందుకు ఆగిపోతున్నాయి
సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపాలి
అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
వెలగపూడి, ఆంధ్రప్రభ : : సంపద సృష్టించి పేదలకు పంచాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. సచివాలయంలో నేడు మంత్రులు , కార్యదర్శులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి అన్నారు. అలాగే పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గత ఐదేళ్ల విధ్వంసంతో చాలా వెనుకబడిపోయాం. నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నాం. ఆరు నెలల పాలనలో 12.94 శాతం వృద్ధి రేటు కనపడింది. ఫైళ్ల పరిశీలనలో వేగం పెంచాలి. వచ్చిన సమస్యలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. సమస్యలను పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఇదేదో కొంతమందిని ఎత్తిచూపడం కాదు.. వ్యవస్థ మెరుగుపడాలి. రేపటికి మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతోంది. గడిచిన ఐదేళ్ల వైకాపా పాలనను ప్రజలు అంగీకరించలేదు. మనపై విశ్వాసం పెట్టుకుని భారీ మద్దతు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉండేది. ఒకట్రెండు కాదు.. ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశాం. నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు అధికారమిచ్చారు. పాలనా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాం. స్వర్ణాంధ్ర-2047 ద్వారా లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. 15 శాతం వృద్ధిరేటుతో మన ఆర్థిక వ్యవస్థ సుస్థిరం కావాలి. అప్పులు కూడా తీర్చాల్సిన అవసరముంది. వనరులవే.. అధికారులూ వాళ్లే.. కానీ వృద్ధిలో వ్యత్యాసం రావాలంటే కార్యదక్షత కావాలి అని చంద్రబాబు అన్నారు.
రెడ్ టేపీజంపై ఆగ్రహం ..
పేరుకు పోతున్న ఫైల్లు , రెడ్ టేపీజం పై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఫైళ్ల క్లియరెన్సులో మంత్రులు, అధికారులు వేగం పెరగాలని, ఆర్థికేతర ఫైళ్లు పెండింగ్‌లో ఉండకూడదని, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ-ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్సు ప్రక్రియ వేగవంతం చేయాలని, వివిధ శాఖల్లో ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్సు జరుగుతున్న క్రమం పై ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీసులో ఫైళ్లు క్లియరెన్సులో వేగం పెరగాలని, ఫైళ్లు ఎక్కడికక్కడ క్లియర్ కాకుండా ఆగిపోతున్నాయనేదానిపైన కార్యదర్శులు, శాఖల విభాగాధిపతులు సమీక్ష చేసుకోవాలని సీఎం సూచించారు. ఆలస్యానికి గల కారణాలు తెలుసుకుని వాటిని తొలగించి ఫైళ్లు త్వరితగతిన పరిష్కారం చేయాలన్నారు. ఫైళ్లలో ఆర్థిక, ఆర్థికేతర అనే రెండు రకాల ఫైళ్లుంటాయని, ఆర్థికేతర ఫైళ్ల పరిష్కారంలో ఫైళ్లు ఎట్టి పరిస్థితిలోనూ పెండింగ్‌లో ఉండకూడదన్నారు. ఆర్థిక పరమైన ఫైళ్లు అయితే ఆయా శాఖల్లోని బడ్జెట్ తదితర అంశాలను సమీక్షించుకుని ఫైళ్లను త్వరితగతిన సమీక్షించాలన్నారు. కొన్ని శాఖల్లో కొంతమంది అధికారులు తమ వద్ద ఫైళ్లను ఆరు నెలలు, ఏడాది వరకు ఉంచుకుంటున్నారని, ఇది సరైన పద్దతి కాదన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో సగటున మూడు రోజుల్లోనే ఫైళ్లు క్లియరెన్సు అవుతున్నాయని, మరికొన్ని శాఖల్లో ఫైళ్లు ఆలస్య అవుతున్నాయని ఆర్టీజీఎస్ సీఈవో దినేష్ కుమార్ వివరణ ఇచ్చారు.
కాగా గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని తాము బలంగా నమ్ముతున్నామని చెప్పారు. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తాము నిరంతరం పనిచేస్తున్నామని అన్నారు. ఈ మేరకు సోషల్ మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించామని గుర్తుచేశారు.