టీడీపీని తిరుగులేని శక్తిగా మారుద్దాం..

టీడీపీని తిరుగులేని శక్తిగా మారుద్దాం..

మావిగన్ అంటున్న లెవెన్ రెడ్డి ఒక సైకో
టీడీపీ మండల విస్తృత సమావేశంలో మైలవరం ఎమ్మెల్యే వసంత

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి, తిరుగులేని శక్తిగా మారుద్దామని, ఇందుకోసం ఐకమత్యంగా శక్తివంచన లేకుండా కృషి చేద్దామని మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని గుంటుపల్లిలో శుక్రవారం రాత్రి టీడీపీ మండల శాఖ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరావతి రాజధానికి మద్దతు ఇవ్వని పార్టీ వైసీపీ అన్నారు. ఇప్పటికే రాజధాని విషయంలో రెండు పర్యాయాలు మోసపోయామన్నారు. లెవెన్ రెడ్డి ఒక సైకో అని మావిగన్ అంటూ వింత పదాలతో వికృత చేష్టలకు దిగి విష ప్రచారం చేస్తున్నాడని దుయ్యబట్టారు. దీన్ని అందరూ తిప్పి కొట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని గురించి గ్రామాల్లో వైసీపీ నేతలను నిలదీయాలన్నారు.

విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. టీడీపీకి కార్యకర్తలే ముఖ్యమన్నారు. వారి సంక్షేమం కోసం తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ టీడీపీ సభ్యత్వం ఉన్న వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించారని తెలిపారు. ఇప్పటికే సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించిందన్నారు. సీఎం చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వంలో టీడీపీని మరింత పటిష్టం చేసేందుకు అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పటిష్టతను నిరూపించాలన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply