MBNR | విద్యుద్ఘాతంతో గుడిసె దగ్ధం.. బూడిదైన కాడెద్దులు

ఊట్కూర్, జులై 4 (ఆంధ్రప్రభ) : విద్యుద్ఘాతంతో గుడిసెదగ్ధమై, కాడెద్దులు సజీవ దహనమైన సంఘటన నారాయణపేట (Narayanpet) జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపొర్ల గ్రామ శివారులో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు బాధిత రైతు లచ్చన్న కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్దపొర్ల గ్రామానికి చెందిన రైతు లచ్చన్న (Lachanna) ప్రతిరోజు మాదిరిగా తన కాడెద్దులను పొలంవద్ద ఉన్న రేకుల షెడ్డు గుడిసెలో కట్టేసి నిన్న సాయంత్రం7:30గంటలకు ఇంటికి వచ్చాడు. రాత్రి మొహర్రం వేడుకలు ఉండడంతో తిరిగి వ్యవసాయ పొలానికి వెళ్లలేదు.
ఉదయం వెళ్లి చూడగా, అప్పటికే విద్యుద్ఘాతంతో మంటలు చెలరేగి రేకుల షెడ్డు గుడిసె పూర్తిగా కాలిపోయి బూడిదగా మారింది. గుడిసెలో ఉన్న కాడెద్దులు సజీవ దహనమయ్యాయి. గుడిసెలో నిలిపిన ద్విచక్ర వాహనం రైతు (Farmer) పంట సాగు కోసం నిలువ చేసుకున్న ఎరువులు, బియ్యం, కోళ్లు, తదితర సామాగ్రి కాలి బూడిదగా మారాయి. ఈ ఘటన చూసిన రైతు నిర్గాంతపోయి బోరున విలపించాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో లచ్చన్న పొలం వద్దకు చేరుకొని సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ ఘటనతో తనకు రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు వాపోయాడు. పశువైద్య శాఖ వీఎస్ఏ ఆంజనేయులు (anjaneyulu) లైన్ మెన్ ఆంజనేయులు ఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ (CPI ML New Democracy) పంథా నాయకులు కిరణ్, లింగప్ప వ్యవసాయ పొలానికి వెళ్లి రైతులు పరామర్శించి రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాడెద్దులు విద్యుదాఘాతంతో మృతి చెందడంతో బాధిత రైతు బోరున విలపించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
