Checks | అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Checks | అర్హులందరికీ సంక్షేమ పథకాలు
- పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
Checks | కొడకండ్ల, ఆంధ్రప్రభ : కొడకండ్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక సర్పంచ్ దూలం మమత సతీష్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాలకుర్తి శాసనసభ్యురాలు, యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 35మంది అర్హులైన లబ్ధిదారులకు మొత్తం రూ.45,05,220ల విలువైన కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారుల చేతికి అందజేశారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ… పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాల సమయంలో ఎదురయ్యే ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకాలు సామాజిక సమానత్వాన్ని పెంపొందిస్తూ, మహిళల ఆత్మగౌరవాన్ని బలోపేతం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పూర్తి పారదర్శకతతో అమలు జరుగుతుందని, ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే ఆర్థిక సహాయం చేరుతోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
భవిష్యత్తులో కూడా మండలంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల లాభాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో చంద్రమోహన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
