- కాంగ్రెస్ శ్రేణులలో సంబరాలు, హర్షధ్వానాలు…
ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : ములుగు జిల్లా మల్లంపల్లి మండలం దేవనగర్ గ్రామపంచాయతీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సలుగుల సంతోష్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గ్రామంలో విజయోత్సాహం నెలకొంది. సలుగుల సంతోష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్న వార్త వెలుగులోకి రాగానే గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి సంబరాలు జరుపుకున్నారు.
బాణాసంచా కాల్చి, పరస్పరం మిఠాయిలు పంచిపెట్టుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ సలుగుల సంతోష్ మాట్లాడుతూ… ఈ అవకాశాన్ని తనకు ఇచ్చి తనపై విశ్వాసం ఉంచిన దేవనగర్ గ్రామ ప్రజలకు పాదాభివందనాలు అని, గ్రామాభివృద్ధే ధ్యేయయని, అహర్నిశలు కష్టపడి దేవనగర్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని, గ్రామ సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పారు. తనకు సహకరించిన నేతలకు సంతోష్ ధన్యవాదాలు తెలుపుతూ మంత్రి సీతక్క, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి సహకారం, మార్గదర్శకత అందించారని పేర్కొన్నారు.
సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామంలో పెండింగ్‌లో ఉన్న చిన్న, పెద్ద సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు మొదలు పెడతానని సంతోష్ హామీ ఇచ్చారు. పంచాయతీ మౌలిక వసతులు, శుభ్రత, తాగునీరు, రహదారుల మెరుగుదల వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. దేవనగర్ గ్రామంలో ఏకగ్రీవంతో చోటుచేసుకున్న రాజకీయ వాతావరణం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని కలిగించింది.

