Brown rice | కొత్త సీడ్ వచ్చిందోచ్..

కొత్త సీడ్ వచ్చిందోచ్..

  • ఇక సన్నబియ్యం చౌకే చౌక
  • ఆర్‌జీఎల్ 7034 పలకరింత
  • ఎన్‌జీ రంగా ఆచార్యుడి ఘనత
  • శాస్త్రవేత్త పీవీ సత్యనారాయణకు రైతన్న ప్రశంసలు

Brown rice | (గుంటూరు బ్యూరో – ఆంధ్రప్రభ) : రాష్ట్రంలో సన్నబియ్యానికి డిమాండ్ పెరుగుతోంది. మనవాళ్ళకు దడ్డు బియ్యం అస్సలు రుచించదు. సన్న రకాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో అందుతున్న బియ్యం నాణ్యతపై విమర్శలు రావడంతో వినియోగదారులు ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పీవీ సత్యనారాయణ ఆవిష్కరించిన ఆర్‌జీఎల్ 7034 రకం రైతులకు, వినియోగదారులకు కొత్త ఆశగా మారింది.

ప్రస్తుతం మినికిట్ దశలో..
ప్రస్తుతం మినీకిట్ దశలో ఉన్న ఈ రకం, రైతుల పొలాల్లో నిర్వహించిన రెండో ఏడాది పరిశీలనల్లో అత్యుత్తమ దిగుబడి సాధించింది. ఏఐసీఆర్‌పీ (ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్) పరీక్షల్లో ఆర్‌జీఎల్ 7034తో పాటు 7033, 7035 వంటి సన్నగింజ రకాలూ పరీక్షించబడుతున్నాయి. ముఖ్యంగా కోస్తా ప్రాంతానికి అనువుగా రూపుదిద్దుకున్న ఈ రకాలపై పరిశోధకులు ప్రత్యేక దృష్టిపెట్టారు.

బీపీటీపై ఆధిక్యం….
బీపీటీ 5204తో పోలిస్తే ఆర్‌జీఎల్ 7034 దిగుబడిలో స్పష్టమైన పైచేయి సాధించింది. దోమపోటు, ఎండాకు వంటి ప్రధాన తెగుళ్లను ఈ రకం సులభంగా తట్టుకుంటుందని పరిశోధనల్లో తేలింది. ఇటీవల వచ్చిన మొంథా తుఫాన్‌ సమయంలో అనేక ప్రాంతాల్లో ఈ రకం పంట పడిపోకుండా నిఠారుగా నిలబడటం శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది.

చిట్టి ముత్యాలతో సంకరణం చేసి…
శ్రీకాకుళం జిల్లా రాగోలు కేంద్రంలో ఎన్‌.ఎల్‌.ఆర్ 34449ను చిట్టి ముత్యాలతో సంగమించి రూపొందించిన ఈ కొత్త రకం సుమారు 140–145 రోజుల్లో కోతకు సిద్ధమవుతుంది. సూచించిన సాగు విధానాలతో 50–60 బస్తాలు సాధ్యమని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. గింజ బరువు, ధాన్య నాణ్యత కూడా బీపీటీ రకాలకు సమానంగా ఉండటం ఈ వంగడం ప్రత్యేకత.

సాగు ఖర్చూ తక్కువే…
ఆర్‌జీఎల్ 7034 రకం సాగులో ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఎకరాకు ఒక బస్తా యూరియా మస్తు అవుతుంది. పురుగుమందు ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. చీడ పీడలు తట్టుకునే సామర్థ్యం ఉండటం వల్ల మందుల వ్యయం దాదాపు లేనట్లే. బీపీటీ రకాలతో పోలిస్తే సాగు వ్యయం తగ్గడమే కాక పెరిగిన దిగుబడి వల్ల రైతుకు మరింత లాభం వస్తుంది.

మొంథా తుఫాన్‌ తట్టుకుని…
బీపీటీ 140 రోజుల్లో కోతకు వస్తే, ఆర్‌జీఎల్ 7034 మాత్రం 145 రోజుల్లో సిద్ధమవుతుంది. ముఖ్యంగా సాల్వా సీజన్‌ చివర్లో వర్షాలు తగ్గిన తరువాత కోత రావడం వల్ల ధాన్యం తడిసిపోవడం వంటి సమస్యలు రైతులకు తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెంకు చెందిన ఆదర్శ రైతు ఆళ్ళ మోహన్ రెడ్డి ఈ రకాన్ని సాగు చేశాక దీని ఈ వంగడం ప్రత్యేకత తెలిసిపోయింది. తనకు ఉన్న 4 ఎకరాల్లో బీపీటీలతో పాటు ఆర్‌జీఎల్ 7034ను కూడా ప్రయోగాత్మకంగా సాగు చేశారు. మొంథా తుఫాన్‌ దెబ్బకి మిగతా రకాలు సాగిలబడ్డాయి. ఆర్‌జీఎల్ 7034 రకం మాత్రం ఈదురు గాలులకు, భారీ వర్షాలకు తట్టుకుని నిలబడి పోయింది. గింజ రాలిక చాలా తక్కువగా ఉండటం, చెరుమీద మొలకలు రాకపోవడం వంటి సుగుణాలు కనిపించాయి. ఇంకో రైతు సంజీవ రెడ్డి కూడా ఈ రకం సాగు చేసి 40–50 బస్తాలు దిగుబడి పొందారు. వ్యవసాయ శాఖ అధికారులు దీనిని కోస్తాకు బీపీటీకి ప్రత్యామ్నాయంగా నిలిచే రకంగా అభివర్ణిస్తున్నారు.

కోస్తాలోనే సన్న రకాల పెరుగుదల…
గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు జిలాల్లో సన్న రకాలే అధికంగా సాగు చేయబడుతున్నాయి. అక్టోబర్–నవంబర్ తుఫాన్ల ధాటికి ప్రతీ ఏటా పెద్ద ఎత్తున పంటలు దెబ్బతింటాయి. ఇటీవల మొంథా తుఫాన్‌లో 3.5 లక్షల ఎకరాల్లో వరి పంట నష్టపోవడం ఇందుకు తాజా ఉదాహరణ. ఇలాంటి పరిస్థితుల్లో 4 అడుగుల ఎత్తులో కూడా పడిపోకుండా నిలబడే ఆర్‌జీఎల్ 7034 వంటి రకాలు మంచి పరిష్కారం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రకం త్వరలో రాష్ట్ర, కేంద్ర వేరైటీ విడుదల ప్రక్రియలోకి రానుంది.

హాట్స్ ఆఫ్ ప్రొఫెసర్ జీ…
ఎం.ఎస్. స్వామినాథన్ అవార్డు గ్రహీత డాక్టర్ పీవీ సత్యనారాయణ వ్యవసాయ రంగానికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎంస్టీయూ-1061 (ఇంద్ర), ఎంస్టీయూ-1121 (శ్రీధృతి) వంటి ప్రముఖ రకాల సృష్టికర్త కూడా ప్రొఫెసర్ సత్యనారాయణే. ఇప్పటికే దేశంలోని 16 రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు అవుతున్న 35కు పైగా వరి రకాలను ఆయన అభివృద్ధి చేశారు. అంతర్జాతీయ స్థాయి పరిశోధనా సంస్థల్లో పనిచేసిన ఆయన, బయోటెక్, హైబ్రిడ్ రైస్ బ్రీడింగ్‌లో నైపుణ్యం సంపాదించారు. ఆర్‌జీఎల్ 7034 ఆయన అభివృద్ధి చేసిన 43వ రకం, సన్నబియ్యం కొరతను తగ్గించే ప్రధాన పరిష్కారంగా నిలవనుంది.

Leave a Reply