Farmer Happy : అన్నదాత పరవశం

Farmer Happy : అన్నదాత పరవశం
- ఎన్టీఆర్ జిల్లాలో వడివడిగా ధాన్యం సేకరణ
- 20,818 టన్నులు కొనుగోలు
- రూ. 49.70 కోట్ల చెల్లింపునకు రెడీ
- 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ
- క్షేత్రస్థాయిలో రైతన్నకు ప్రభుత్వం చేయూత
- సరళీకృత విధానంపై రైతుల ప్రశంసలు..
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో)
రైతుల క్షేమం, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం.. ప్రతి రైతుకూ తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా చేయూతనిస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటతో అన్నదాతల ఇంట సిరులు వెలుగులు నింపేలా కృషిచేస్తోంది. 2025-..26 ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎన్టీఆర్ జిల్లాలో వడివడిగా సాగుతోంది. ఎవరికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, వ్యవసాయం, పౌర సరఫరాలు, సహకార తదితర శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
లక్ష్యాలకు అనుగుణంగా..
ఈ ఖరీఫ్ సీజన్‌లో ధాన్యాన్ని మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు రైతుల నుంచి నేరుగా సజావుగా కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్‌కే) ద్వారా ఈ ప్రక్రియ ముందుకెళ్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 17న ప్రారంభమైన కొనుగోళ్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో రైతు హితంగా సాగుతోంది. తిరువూరు డివిజన్‌లో 44, నందిగామ డివిజన్‌లో 18, విజయవాడ డివిజన్‌లో 17 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ధాన్యాన్ని సేకరించేందుకు సుమారు 18,75,000 గోనె సంచులు అవసరం కాగా, ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 12,00,700 గోనె సంచులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో తిరువూరు డివిజన్‌లో 7,09,400, విజయవాడ డివిజన్‌లో 3,50,200, నందిగామ డివిజన్‌లో 1,41,100 గోనె సంచులను అందుబాటులో ఉంచారు.
..గతం కంటే మిన్నగా….
2024..-25 ఖరీఫ్ సీజన్‌లో నవంబర్ నెల వరకు మొత్తం 7,430 టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. అయితే ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు రూ. 49.70 కోట్ల విలువైన 20,818 టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిన దగ్గరి నుంచి 12 నుంచి -24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం సొమ్ము జమవుతుండటంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అడుగు అడుగునా తడబాటు లేకుండా పటిష్ట ప్రణాళికతో పనిచేస్తుండటం వల్ల ఇది సాధ్యమైంది. వాహనాల వినియోగంలోనూ గణనీయమైన వృద్ధి నమోదైంది. గత ఖరీఫ్ ప్రధాన సీజన్‌లో 433 వాహనాలు నమోదు కాగా, ప్రస్తుత సీజన్‌లో మొత్తం 1,347 జీపీఎస్ వాహనాలు నమోదయ్యాయి. వీటిలో తిరువూరు డివిజన్‌లో 485, విజయవాడ డివిజన్‌లో 369, నందిగామ డివిజన్‌లో 493 వాహనాలు ధాన్యం రవాణాకు అందుబాటులో ఉన్నాయి.
ఇబ్బంది అనే మాటే లేదు..
ఈ ఏడాది ఖరీఫ్‌లో ధాన్యం అమ్మకం విషయంలో ఇబ్బంది అనేదే లేదు. రైతు సేవా కేంద్రాల ద్వారా చాలా చక్కగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఆరింది ఆరినట్లే తేమ శాతాన్ని చూసి కొనుగోలు చేస్తున్నారు. గతంలో ధాన్యం డబ్బులు ఎప్పుడు వస్తాయో అని వేయికళ్లతో ఎదురుచూసేవాళ్లం. ఇప్పుడు 12-.. నుంచి 24 గంటల్లోనే ధాన్యం సొమ్ము ఖాతాల్లో జమవుతోంది. గోనె సంచులు, రవాణా వాహనాలు.. ఇలా ఏ విషయంలోనూ ఇబ్బంది లేదు.
శ్రీనివాసరావు, వావిలాల , తిరువూరు మండలం, ఎన్‌టీఆర్ జిల్లా
ప్రభుత్వానికి ధన్యవాదాలు
రైతులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. బీపీటీ 5204 రకం ధాన్యాన్ని పండించాను. రైతు సేవా కేంద్రం సిబ్బంది సాయంతో నేను ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండానే అమ్మగలిగాను. గతంలో గోనె సంచులకు సైతం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇప్పుడు సంచులు ఎన్ని కావాలంటే అన్ని అందుబాటులో ఉన్నాయి. మిల్లులకు కూడా రవాణా చేసేందుకు వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
