Ramoji | ఘన నివాళి

నిజాయితీ, నిబద్ధతకు నిలువెత్తు రూపం రామోజీరావు
Ramoji | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : పద్మవిభూషణ్, మీడియా దిగ్గజం స్వర్గీయ చెరుకూరి రామోజీరావు జయంతిని పురస్కరించుకుని అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రామోజీరావు తెలుగు పత్రికా రంగానికే కాక, యావత్ తెలుగు జాతికి ఒక దిక్సూచి అని ఆయన ధైర్యం, క్రమశిక్షణ, నిబద్ధత అందరికీ ఆదర్శమని అన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అనేక రంగాల్లో సంస్థలను స్థాపించి, వేలాది మందికి ఉపాధి కల్పించిన ఆయన దార్శనికత చిరస్మరణీయం అని కొనియాడారు. రామోజీరావు పట్టుదల, క్రమశిక్షణ, నమ్మిన విలువల కోసం నిలబడడం వంటి లక్షణాలతో వేల మందికి ఉపాధి కల్పించి, తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని కనపర్తి అన్నారు.
దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజ సంక్షేమానికి నిరంతరం పోరాడిన యోధుడు రామోజీరావు అని వ్యవస్థలో మంచి మార్పు కోసం నిరంతరం కృషి చేసిన చెరుకూరి రామోజీరావు తెలుగు వారి మదిలో చిరస్మరణీయుడన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మోర్ల రాంబాబు, పర్చూరి దుర్గా ప్రసాద్, మండలి రామమోహన రావు, బండే రాఘవ, ఘంటసాల రాజమోహన రావు, దాసినేని శ్రీనివాసరావు,వడ్డీ రవీంద్ర ,గుంటూరు వినయ్ బాబు, కొల్లూరి ఇమ్మానియేలు, తూమాటి ప్రసాద్, కొండవేటి గోవిందు, పాగోలు రాంప్రసాద్, యలవర్తి వెంకటేశ్వర రావు, చెన్ను బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
