ఒంగోలులో భారీ వర్షం
(ఒంగోలు, ఆంధ్రప్రభ బ్యూరో)
బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తుండలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఐదు నుండి పది సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయింది. ప్రధానంగా మండలాలలో భారీ వర్షం కురిసింది. అల్పపీడనంతో సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో జాలర్లు వేటకు వెళ్లడం లేదు. కాగా భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సింగరాయకొండ, ఒంగోలు కొత్తపట్నం నాగలపులపాడు మండలాల్లోని పాఠశాలలు అంగన్వాడి సెంటర్లకు గురువారం సెలవు దినంగా ప్రకటించారు.
జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం వరకు మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. భారీ వర్షాల కారణంగా 1543 హెక్టార్లు మొక్కజొన్న పత్తి, సజ్జ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రధానంగా జిల్లాలోని వాగులు వంకల్లోకి భారీగా వరద నీరు చేరింది. ముదిగొండ వాగు భారీగా ప్రవహిస్తోంది. కాగా జిల్లా కేంద్రమైన ఒంగోలులో బుధవారం ఉదయం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లన్నీ జలమయం కావడంతో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో మురుగునీరు రోడ్ల పైకి ప్రవహించాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.