బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివ‌ర్గ స‌మావేశం ముగిసింది. కాగా, ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ముఖ్యంగా, బీసీ రిజర్వేషన్లపై తదుపరి కార్యాచరణ, కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటు, అలాగే రూ. 10,500 కోట్ల విలువైన హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ఆమోదం వంటి నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

ముఖ్య నిర్ణయాలు, చర్చించిన అంశాలివే…

  • స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన SLP (స్పెషల్ లీవ్ పిటిషన్) డిస్మిస్ అయిన నేపథ్యంలో, తదుపరి కార్యాచరణపై కేబినెట్ చర్చించింది. ఈ కేసును వాదించిన న్యాయ నిపుణుల సలహాలు, సూచనల మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. రెండు రోజుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలతో కూడిన నివేదికను సమర్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
  • జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో కొత్తగా మూడు వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వ్యవసాయ కళాశాలలు లేని ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే వీటిని ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
  • ఇక‌ రాష్ట్రంలో ‘ప్రజా ప్రభుత్వం’ ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయించింది.
  • రూ.10,500 కోట్లతో 5,500 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన ఆర్ అండ్ బీ హ్యామ్ (HAM – Hybrid Annuity Model) రోడ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో దీనికి సంబంధించిన టెండర్లను పిలవాలని నిర్ణయం తీసుకుంది.
  • రైతు భరోసా పథకం అమలు, మైనింగ్‌కు కొత్త పాలసీ రూపొందించడం, మెట్రో ఫేజ్-2 టెండర్ల ప్రక్రియ వంటి కీలక అంశాలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది.

మంత్రి కొండా సురేఖ డుమ్మా..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. తన ఇంటి వద్దకు పోలీసులు రావడంపై ఆమె ఆగ్రహంగా ఉన్న కారణంగానే ఈ సమావేశానికి గైర్హాజరైనట్లు తెలుస్తోంది.

Leave a Reply