ధర్మం – మర్మం :

గంగానది కర్మ భూమికి చేరిన విధానమును గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

మేరు పర్వతమున చేరి ఉన్న గంగానదిని బాలుడయిన భగీరధుడు నీవు ఈ కర్మభూమిలో ఉండవలయునని ప్రార్థించగా సమ్మతించిన గంగాదేవి హిమాలయ పర్వతమునకు వెళ్ళెను. హిమాలయ పర్వతము నుండి భారత వర్షమున ప్రవహించి పూర్వ సముద్రమున కలియుచున్నది.

మహేశ్వరీ వైష్ణవీచ శైవ బ్రాహ్మీచ పావనీ
భాగీరధీ దేవనదీ హిమవచ్ఛికరాశ్రయ
మహేశ్వర జటావారి ఏవం వైవిధ్య మాగత మ్‌
వింధ్యస్య దక్షిణ గంగా గౌతమీ సనిగద్యతే
ఉత్తరే సాపి వింధ్యస్య భాగీర ధ్యభి ధీయతే

మహేశ్వరీ, వైష్ణవీ, బ్రాహ్మీ, పావనీ, భాగీరధీ, దేవనదీ, హిమవత్‌ శిఖరాశ్రయా, మహేశ్వర జటావారి అను ఈ ఎనిమిది నామములను స్మరించిన వారికి పునర్జన్మ ఉండదు. ఈ రీతిలో శంకరుని జటలో ఉన్న జలము రెండుగా విభజించబడినది. ఈ శ్లోకములను అనగా గంగానామములను, గంగా భేదమును, గంగా ప్రవాహ ప్రాంతమును వర్ణించు వాటిని ప్రతి దినము ఉదయమునే భక్తి శ్రద్ధలతో పఠించినచో అనంత కోటి తీర్థములలో స్నానము చేసిన ఫలము లభించును.

వింధ్య పర్వతానికి దక్షిణ ప్రాంతలో ఉన్న గంగను గౌతమీ అని, ఉత్తర ప్రాంతంలో ఉన్న గంగను భాగీరథీ అనిఅందురు. విష్ణుపాదము నుండి మహేశ్వర జటాజూటము చేరిన గంగ అచట నుండి భూలోకమునకు గోదావరీ, గంగా నదుల పేర్లతో అవతరించి ప్రవహించి భారత వర్ష వాసులను, దేవతలను, రాక్షసులను పశుపక్ష్యాదులను, సకల స్థావర జంగమములను తరింపచేసెను. ఈ కథను చదివినా, విన్నా, చెప్పినా సకల పాపముల నుండి విముక్తి పొంది పవిత్రులగుదురు.

శివ జటాజూటమున ఉన్న గంగ కర్మ భూమికి అవతరించిన విధానమును ఈవిధంగా బ్రహ్మపురాణ ంలోని గౌతీమీఖండమున బ్రహ్మ నారదునికి వివరించెను.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *