ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోడీతో సోమవారం టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన తన తాజా సమావేశంపై పుతిన్ మోడీకి పూర్తి వివరాలు తెలియజేశారు.
వాషింగ్టన్‌లో ట్రంప్‌తో జరగబోయే యూరోపియన్ నాయకులు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశానికి ముందుగానే పుతిన్ మోడీతో మాట్లాడడం ఈ కాల్ ప్రాధాన్యాన్ని గణనీయంగా పెంచింది. ఈ ముందస్తు చర్చతో టెలిఫోన్ సంభాషణకు అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగింది.
మోదీ ట్వీట్ !
ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్పందిస్తూ, “ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం తప్ప మరో మార్గం లేదు. భారత్ ఎల్లప్పుడూ శాంతి కోసం స్వరం ఎత్తింది. ఈ దిశగా జరిగే ప్రతి కృషికి మద్దతు ఇస్తుంది. తన మిత్రుడు పుతిన్ చేసిన కాల్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్‌లో మరిన్ని చర్చలకు ఎదురుచూస్తున్నానని” అని ట్వీట్ చేశారు.
ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ…
ఉక్రెయిన్ అంశంతో పాటు భారత్–రష్యా ద్వైపాక్షిక సహకారం, వాణిజ్యం, భద్రత వంటి అనేక అంశాలపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకోవాలని ఇరువురూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.