ప్రతి నెల రేషన్ కోసం ఇంటి నుండి సంచులను తీసుకెళ్లడం సాధారణ విషయం. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. వచ్చే నెలలో రేషన్ దుకాణాలలో లబ్ధిదారులు కొత్త అనుభవాన్ని ఎదుర్కోబోతున్నారు. రేషన్ లబ్ధిదారుల కోసం ప్రభుత్వం కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది.
రేషన్ కార్డుదారులకు సాధారణ బియ్యం మాత్రమే కాకుండా ఎకో ఫ్రెండ్లీ సంచులను కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో లబ్ధిదారుల సౌకర్యాన్ని పెంచడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు జరగనుంది. ఈ సంచులు ఇప్పటికే జిల్లాల వారీగా స్టాక్ పాయింట్లకు చేరుకున్నాయి. కార్డుల సంఖ్య ప్రకారం రేషన్ డీలర్లకు అధికారుల ద్వారా పంపిణీ జరగనుంది.
ఈ సంచులపై కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు పథకాలను ప్రస్తావించే లోగో, దాంతో పాటు ‘అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ అనే నినాదం ముద్రించి ఉటుంది.
రేషన్ సరఫరా గణాంకాలు..
రాష్ట్రంలో సుమారు 95 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల సన్న బియ్యం అందజేస్తున్నారు. వర్షాకాల సమస్యలను దృష్టిలో ఉంచుకొని జూన్ నెలలోనే జూన్, జులై, ఆగస్టు నెలల రేషన్‌ను ముందుగానే పంపిణీ చేశారు.
రేషన్ ద్వారా బియ్యం మాత్రమే కాకుండా చక్కెర, గోధుమలు అందుతున్నాయి. ప్రజలు అయితే నూనె, పప్పులు, చింతపండు, ఉప్పు వంటి నిత్యావసర వస్తువులు కూడా ఇలాగే రేషన్ షాపుల ద్వారా అందించాలని కోరుతున్నారు.
ఈ కొత్త నిర్ణయంతో, ప్రతి రేషన్ లబ్దిదారునికి ఇప్పుడు బియ్యంతో పాటు పర్యావరణ అనుకూల సంచి లభిస్తుంది. ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా ప్రజలకు సౌకర్యాన్ని కూడా కలిగించనుంది.