టీమిండియా టెస్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ మరోసారి అంతర్జాతీయ గుర్తింపు సాధించాడు. ఇప్పటికే మూడు సార్లు గెలుచుకున్న ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్ అవార్డును, తాజాగా 2025 జూలై నెలకు సంబంధించి నాలుగోసారి కైవసం చేసుకున్నాడు.

ఇటీవల జరిగిన ఇంగ్లండ్‌ పర్యటనలో గిల్‌ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ మెరిపించాడు. జూలైలో జరిగిన మూడు టెస్టుల్లో 94.50 సగటుతో 567 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, ఒక డబుల్‌ సెంచరీ ఉన్నాయి. మొత్తంగా ఆ సిరీస్‌లో 754 పరుగులు సాధించి ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా నిలిచాడు.

గట్టి పోటీని అధిగమించిన గిల్..

ఈ అవార్డు రేసులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ ముల్డర్‌ గిల్‌కు గట్టి సవాల్‌ విసిరారు. అయితే, అత్యధిక ఓట్లు పొందిన శుభ్‌మన్‌ వారిద్దరినీ వెనక్కినెట్టి విజేతగా నిలిచాడు.

ఈ ఏడాది గిల్‌కు ఇది రెండోసారి దక్కిన ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్ అవార్డు. 2025 ఫిబ్రవరిలోనూ ఆయన ఈ ఘనత సాధించాడు.

అంతకుముందు 2023లో జనవరి, సెప్టెంబర్‌లలో కూడా ఈ అవార్డును గెలుచుకున్నాడు. మొత్తం నాలుగుసార్లు ఈ అవార్డు గెలుచుకున్న తొలి పురుష క్రికెటర్‌గా గిల్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో పాకిస్తాన్‌ క్రికెటర్‌ బాబార్‌ ఆజమ్‌ (3 సార్లు)ను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు.

Leave a Reply