శ్రీకాకుళం టిడ్కో లబ్ధిదారులకు భారీ ఊరట
ఎమ్మెల్యే గొండు శంకర్ చేతుల మీదుగా రూ. 10.50 కోట్ల చెక్కుల పంపిణీ
మొదటి విడత క్రింద 40 మంది లబ్ధిదారులకు స్వయంగా చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : నగరపాలక సంస్థ పరిధిలో టిడ్కో అపార్ట్మెంట్ల కోసం ముందుస్తుగా డబ్బులు చెల్లించి, ఏళ్లు గడుస్తున్నా ఇళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. అపార్ట్మెంట్లు రాక, తాము కట్టిన కష్టార్జితం ఏమవుతుందోనని ఆందోళన చెందిన పేద ప్రజల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, బాధిత లబ్ధిదారులకు వారి డబ్బును తిరిగి చెల్లించి ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే గొండు శంకర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. టిడ్కో అపార్ట్మెంట్ల కోసం అమౌంట్ చెల్లించి నష్టపోయిన శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని లబ్ధిదారులందరికీ భారీ ఊరటనిస్తూ మొత్తం 10,50,91,000 రూపాయిలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ భారీ మొత్తానికి సంబంధించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెగా చెక్కును ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులతో కలిసి ప్రదర్శించి, లబ్ధిదారులకు పంపిణీ చేసే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా, మొదటి విడత కింద 40 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా చెక్కులను అందజేశారు. సాంకేతిక ప్రక్రియలు పూర్తి చేసి, మిగిలిన లబ్ధిదారులందరికీ కూడా అతి త్వరలోనే చెక్కులను పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారుల డబ్బును చెక్కుల రూపంలో వారికి తిరిగి భద్రంగా అందించడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదల పట్ల తమకున్న చిత్తశుద్ధిని, నిబద్ధతను మరోసారి చాటుకుంది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్, పట్టణ పార్టీ అధ్యక్షులు పాండ్రంకి శంకర్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు రెడ్డి గిరిజా శంకర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ అండవరపు సంతోష్, స్టేట్ డైరెక్టర్ పి.ఎమ్.జె. బాబు, ఎం.హెచ్.ఓ సుధీర్ కుమార్ తదితర నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు పెద్ద ఎత్తున టిడ్కో లబ్ధిదారులు పాల్గొన్నారు.
