గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవాలి

గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవాలి

  • ఫసల్వాడి గ్రామ సభలో డీజీపీ మహేష్ భగవత్
  • హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోతే గ్రామానికి నో ఎంట్రీ
  • ఫసల్వాడి సర్పంచ్ హరిప్రసాద్ ముదిరాజ్
  • ఆరైవ్ అలైవ్ సందేశంతో రోడ్డు భద్రతపై అవగాహన

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని డీజీపీ మహేష్ మురళీధర్ భగవత్ అన్నారు. మొబైల్ ఫోన్‌కు రక్షణ కల్పించేలా స్క్రీన్ గార్డ్ వేయిస్తామని, అంతకంటే విలువైన మన ప్రాణాలను కాపాడుకునేందుకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కారులో డ్రైవర్‌తో పాటు ప్రయాణికులందరూ సీటు బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు.
పండుగలకు హెల్మెట్‌ను బహుమతిగా ఇవ్వాలి పండుగల సందర్భంగా అల్లుళ్లకు కొత్త బట్టలతో పాటు హెల్మెట్‌ను బహుమతిగా ఇస్తే వారి ప్రాణరక్షణకు ఉపయోగపడుతుందని సూచించారు.

“గమ్యస్థానానికి చేరుకోవడం ముఖ్యమే.. కానీ సురక్షితంగా చేరుకోవడం మరింత ముఖ్యమైనది” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామ సభకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా “ఆరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

గ్రామ సర్పంచ్ హరిప్రసాద్ ముదిరాజ్ మాట్లాడుతూ గ్రామంలో ఇకపై హెల్మెట్, సీటు బెల్ట్ ధరించని వారికి ప్రవేశం ఉండదని, “నో హెల్మెట్.. నో ఎంట్రీ” విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు..జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించి పరిమిత వేగంతో ప్రయాణించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ “ఆరైవ్ అలైవ్” అంటే సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవడమని పేర్కొన్నారు. చిన్న చిన్న నిర్లక్ష్యాలు కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగులుస్తాయని, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ ప్రజలతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించి, హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎంహెచ్‌వో లలితదేవి, ఆర్డీవో గున్నాల రాజేందర్, రవాణా శాఖ జాయింట్ కమిషనర్ వెంకటరమణ, డీఎస్పీ సత్యయ్యగౌడ్, ఎమ్మార్వో జయరాం నాయక్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *