49People | చంపేసిన.. స‌హారా!

49People | చంపేసిన.. స‌హారా!

49People | దాహ‌ర్తితో 49 మంది మృతి
పొరుగుదేశం వెళ్లి వ‌స్తుండ‌గా నైజర్‌లో మొరాయించిన ట్ర‌క్కు
దాహంతో అలమటించి ప్రాణాలు విడిచిన బాధితులు
50 కిలోమీటర్లు నడిచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ‌ ఇద్దరు
ఆ ఇద్ద‌రు ఇచ్చిన స‌మాచారంతోనే వెలుగులోకి దుర్ఘ‌ట‌న‌
మృతదేహాలను ఎడారిలో సామూహిక ఖననం

49People | న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : పశ్చిమాఫ్రికా దేశమైన నైజర్‌లోని సహారా ఎడారిలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న ట్రక్కు మార్గమధ్యంలో సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో, తాగునీరు లభించక 49మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర నైజర్‌లోని అగడెజ్ ప్రాంతంలో ఈ ఘోర ఉదంతం వెలుగుచూసింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, మృతులంతా నైజర్ దేశస్తులే. పొరుగు దేశమైన మాలిలో జరిగిన ఒక మతపరమైన ఉత్సవానికి హాజరై స్వదేశానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అల్జీరియా, మాలి సరిహద్దులకు సమీపంలోని అస్సమకా పట్టణానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో వీరి వాహనం నిలిచిపోయింది.

దీంతో ప్రయాణికులందరూ ఎడారిలో రోజుల తరబడి చిక్కుకుపోయి, తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఘోర ప్రమాదం నుంచి ఇద్దరు వ్యక్తులు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. వారు సుమారు 50 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించి, అస్సమకా పట్టణానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకోగా, ట్రక్కు పరిసరాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు దర్శనమిచ్చాయి. మృతదేహాలను తరలించడం కుదరకపోవడంతో, వారిని అక్కడే సామూహికంగా ఖననం చేశారు.

అధిక ఉష్ణోగ్ర‌త‌ల‌తో ముప్పు

ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అత్యంత కఠినంగా ఉంటాయని, విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా ఇక్కడ చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడటం అసాధ్యమని అధికారులు తెలిపారు. అదే సమయంలో, సమీపంలోనే నిలిచిపోయిన మరో ట్రక్కులోని ప్రయాణికులను సహాయక బృందాలు గుర్తించి, వారికి నీరు అందించి రక్షించాయి. ఉత్తర ఆఫ్రికా, ఐరోపా దేశాలకు వెళ్లే వలసదారులకు, ప్రయాణికులకు ఈ మార్గం అత్యంత ప్రమాదకరంగా మారిందని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

click here to read అందుబాటులోకి తెచ్చిన కేంద్రం

click here to read more